అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Graduate MLC | తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ – ఖమ్మం – వరంగల్ నియోజకవర్గ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ రెండు స్థానాలకు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు టికెట్లు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Telangana Graduate MLC | సామాజిక అన్యాయమంటూ విమర్శలు..
ఈ పరిణామంపై తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె సూటి ప్రశ్నలు సంధించారు. “రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు చోట్లా రెడ్డి నాయకులకే టికెట్.. ఇది ముమ్మాటికీ సామాజిక అన్యాయం కాదా?” అంటూ నిలదీశారు.
Telangana Graduate MLC | తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధం..
ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుందని కవిత గుర్తుచేశారు. అలా కాకుండా కేవలం ఒకే వర్గానికి పెద్దపీట వేయడం తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆమె ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి.
ఇది కూడా చదవండి: Asian Games Archery | భారత్ గురి అదిరింది.. ఆర్చరీలో రెండు బంగారు పతకాలు