అక్షరటుడే, కామారెడ్డి: Telangana Power Cuts | రాష్ట్రంలో విద్యుత్ కోతలకు సీఎం (CM Revanth Reddy) తప్పిదమే కారణమని, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నెట్టేస్తున్నారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Telangana Power Cuts | విద్యుత్ అధికారులను బెదిరించడం సరికాదు
హడావుడిగా విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నిసార్లు చెప్పినా మారరా అంటూ ముఖ్యమంత్రి బెదిరించడం సరికాదని గంప గోవర్ధన్ అన్నారు. సీఎం తప్పిదంతో కరెంట్ కోతలు వస్తే సురేష్ అనే అధికారిని సస్పెండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండేదని, 2014 తర్వాత మూడేళ్లలో వేల కోట్లు ఖర్చు చేసి గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు 24 గంటల కరెంట్ సరఫరా చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా ఉన్నప్పుడు కోతలు లేని కరెంట్ ఇవ్వడం ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు. ఎల్నినో పేరుతో ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంటే ఒక్క తెలంగాణలోనే కోతలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.
Telangana Power Cuts | ముందే హెచ్చరించినా..
ఐక్యరాజ్యసమితి ముందే హెచ్చరించినా సీఎం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని గంప గోవర్ధన్ విమర్శించారు. ఆదిలాబాద్లో రైతులు అర్ధనగ్నంగా తలకిందులుగా నిరసన చేయడం సీఎం అసమర్థతకు నిదర్శనన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం కేసీఆర్ భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటికి బొగ్గు సరఫరా చేయలేని దుస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందన్నారు. మాచారెడ్డికి చెందిన దళిత రైతు దేవరాజు జనరేటర్ ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటే వరంగల్కు చెందిన అధికారి ఫోన్ చేసి జనరేటర్ ఎందుకు పెట్టావని బెదిరించారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, నాయకులు కాసర్ల స్వామి, హఫీజ్, భాను ప్రసాద్, మామిండ్ల లక్ష్మణ్, గోపు నర్సింలు, కృష్ణాజిరావు, కుంబాల రవి యాదవ్, బల్వంత్ రావు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Farmers Issues | రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..: మాజీ ఎమ్మెల్యే బిగాల