Thummidihatti Project | మహారాష్ట్ర సీఎంతో రేవంత్​రెడ్డి భేటీ.. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై చర్చ

కాంగ్రెస్​ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో భేటీ అయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, హైదరాబాద్​ ప్రతినిధి: Thummidihatti Project |కాంగ్రెస్​ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​తో భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా అధికారుల బృందం ప్రాజెక్ట్​పై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం గురించి చర్చించారు. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్​ 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే మహారాష్ట్ర సర్కార్ గతంలో 148మీటర్ల ఎత్తుకు అంగీకరించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎత్తు పెంపు గురించి ఆలోచించింది. ఈ మేరకు తాజాగా మహారాష్ట్ర సీఎంతో చర్చలు జరిపింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను మహారాష్ట్ర సీఎంకు వివరించారు. దీనిపై 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్ బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి.. వివిధ దశల్లో జరుగుతున్న ప్రయత్నాలను తెలిపారు. 5 దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తుచేశారు.

Thummidihatti Project | సాగునీటి అవసరాలు తీరవు

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ 2016లో ఒప్పందం కుదిరిందని ఉత్తమ్​ పేర్కొన్నారు. ఈ ఎత్తుతో నిర్మిస్తే తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవన్నారు. 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని వివరించారు. దీంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Thummidihatti Project | వెనుకబడిన ప్రాంతం

సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన అటవీ ప్రాంతమన్నారు. గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లారు.వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ప్రాజెక్ట్​ కీలకమన్నారు. పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దీనిపై మరోసారి పరిశీలిస్తామన్నారు. తుది నిర్ణయానికి వచ్చే ముందు పలు అంశాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోతే 148 మీటర్ల ఎత్తు ఒప్పందాన్ని పున: పరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు.

ఇది కూడా చదవండి..: Arnab Cyclone | దూసుకొస్తున్న అర్నబ్​ తుపాన్​..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *