అక్షరటుడే, భీమ్‌గల్: Urea Stocks Nizamabad | జిల్లాలో సాగుకు అవసరమైన యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాల్కొండ (Balkonda) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో నిజామాబాద్ జిల్లాకు ఇప్పటివరకు 39 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా చేరిందని ఆయన పేర్కొన్నారు.
Urea Stocks Nizamabad | సరఫరా వేగవంతం
జిల్లాకు కేటాయించిన కోటా నుంచి ఇప్పటికే 1.50 లక్షల మంది రైతులు (Farmers) ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని, 16వేల మెట్రిక్ టన్నుల యూరియాను డెలివరీ తీసుకున్నారు. ఇంకా 23వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Urea Stocks Nizamabad | సొసైటీల నిర్వాకంతో ఇబ్బందులు
పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు) పూర్తిగా భ్రష్టుపట్టి, డిఫాల్ట్‌గా మారిపోయాయని సునీల్ కుమార్ మండిపడ్డారు. ఈ కారణంగానే సొసైటీలు సకాలంలో డబ్బులు కట్టి యూరియాను తీసుకురాలేకపోతున్నాయన్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. సొసైటీల పాలకవర్గాలు తమ చేతకానితనాన్ని ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని, విపక్షాల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని హితవు పలికారు. రైతులు తమ పరిధిలోని సొసైటీలకు వెళ్లి, అక్కడి ఛైర్మన్లు, అధికారులపై ఒత్తిడి తెచ్చి యూరియా కోసం డబ్బులు కట్టించే బాధ్యత తీసుకోవాలని కోరారు. సొసైటీలకు యూరియా సకాలంలో చేరేలా చూసే పూర్తి బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Urea Stocks Nizamabad | దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ‘యాప్’ విధానం

అప్లికేషన్ ద్వారా యూరియా పొందడంలో రైతులకు కొంత ఇబ్బంది ఎదురవుతున్న మాట వాస్తవమేనని సునీల్ కుమార్ అంగీకరించారు. అయితే.. ఐదు సంచుల అవసరం ఉన్నవారు 20 సంచులు కొనుగోలు చేసి దాచిపెట్టుకోవడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అప్లికేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయని స్పష్టం చేశారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని.. వాస్తవాలను గమనించి రైతులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Student Leaders Arrest | కలెక్టరేట్లో విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్