అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Green Card Suspension | అమెరికా ప్రభుత్వం విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస హోదా కల్పించే ప్రక్రియలో కీలకమైన PERM (Permanent Labor Certification) కార్యక్రమంపై కఠిన చర్యలు చేపట్టింది.
మైక్రోసాఫ్ట్, అడోబ్‌తో పాటు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ ఐటీ సంస్థలను ఈ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ ప్రకటించింది.
US Green Card Suspension | భారతీయ ఐటీ ఉద్యోగులపై ప్రభావం?
PERM అనేది అమెరికాలోని సంస్థలు విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకునే ముందు కార్మిక శాఖ నుంచి ధ్రువీకరణ పొందే ప్రక్రియ. ఉద్యోగానికి అర్హత కలిగిన అమెరికన్ కార్మికుడు అందుబాటులో లేడని నిర్ధారించే ఈ ప్రక్రియ, ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ దరఖాస్తుల్లో కీలక దశగా ఉంటుంది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
అందువల్ల ఈ సంస్థల్లో పనిచేస్తున్న హెచ్-1బీ ఉద్యోగులు గ్రీన్‌కార్డ్ ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే హెచ్-1బీ వీసా కార్యక్రమాన్నే పూర్తిగా రద్దు చేసినట్లు ఈ నిర్ణయం అర్థం కాదు. ప్రధానంగా PERM ద్వారా శాశ్వత నివాసం కోసం చేసే కార్మిక ధ్రువీకరణ ప్రక్రియపై ఆంక్షలు విధించారు.
US Green Card Suspension | మైక్రోసాఫ్ట్‌పై జేడీ వాన్స్ తీవ్ర ఆరోపణలు
మైక్రోసాఫ్ట్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించిన సమయంలోనే పెద్ద సంఖ్యలో హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్‌ల ద్వారా విదేశీ ఉద్యోగులకు ప్రయోజనం కల్పించిందని ఆయన ఆరోపించారు.
వాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించగా, అదే సమయంలో కంపెనీకి సంబంధించి సుమారు 6,300 హెచ్-1బీ వీసాలు, దాదాపు 3,000 గ్రీన్‌కార్డ్‌ల ప్రయోజనం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ వీసా వ్యవస్థను సంస్థ దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు.
అమెరికన్ ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వాన్స్ స్పష్టం చేశారు. విదేశీ కార్మికుల నియామకం ద్వారా అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతినకూడదన్నది ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు.
US Green Card Suspension | 9 యూనివర్సిటీలపైనా విచారణ
ఇదే సమయంలో వీసా సంబంధిత కార్యక్రమాల దుర్వినియోగంపై అమెరికాలోని తొమ్మిది ప్రముఖ యూనివర్సిటీలపై కూడా విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. హార్వర్డ్, యేల్, స్టాన్‌ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు ఈ పరిశీలనలో ఉన్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయ విద్యార్థుల నియామకం, వీసా కార్యక్రమాల వినియోగం, అమెరికన్ ఉద్యోగాలపై వాటి ప్రభావం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
US Green Card Suspension | గ్రీన్‌కార్డ్ ఆశలపై కొత్త అనిశ్చితి
అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్-1బీపై పనిచేస్తూ ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి PERM దశలో ఏర్పడే ఈ అడ్డంకి వారి శాశ్వత నివాస ప్రక్రియను ఆలస్యం చేయవచ్చు.
అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ చర్యలను వీసా వ్యవస్థలో అక్రమాలు, మోసాలను అరికట్టడంతో పాటు దేశీయ ఉద్యోగులకు ప్రాధాన్యం కల్పించే చర్యల్లో భాగంగా వివరిస్తోంది. కాగా, సస్పెన్షన్‌కు గురైన కంపెనీలపై వచ్చిన ఆరోపణలు, వాటి తదుపరి పరిణామాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.