Vaibhav Suryavanshi Century | 36 బంతుల్లో సెంచరీతో చరిత్ర సృష్టించిన వైభవ్.. తండ్రికి ‘సారీ’ చెప్పి హృదయాలు గెలుచుకున్న‌ యువ సంచలనం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaibhav Suryavanshi Century | ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో మరో సంచలన ప్రదర్శన నమోదైంది. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో స్టేడియాన్ని షేక్ చేస్తూ క్రికెట్ అభిమానులను మంత్ర ముగ్ధులను చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ 15 ఏళ్ల ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన రెండో సెంచరీగా నిలిచాడు.

ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ (Vaibhav Suryavanshi), మొదటి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలిపాడు. అదే వేగాన్ని కొనసాగిస్తూ బౌలర్లపై ఎటువంటి భయం లేకుండా భారీ షాట్లతో పరుగులు సాధించాడు. గత సీజన్‌లో కూడా మెరుపు సెంచరీతో రికార్డు సృష్టించిన ఈ కుర్రాడు, మరోసారి అలాంటి ఇన్నింగ్స్ ఆడి తన సామర్థ్యాన్ని నిరూపించాడు.

Vaibhav Suryavanshi Century | కెమెరా సాక్షిగా చేతులు జోడించి ..

అయితే మ్యాచ్ తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన అందరి మనసులను గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) షేర్ చేసిన వీడియోలో టీమ్ మేనేజర్ రోమీ భిందర్ సరదాగా వైభవ్‌తో మాట్లాడారు. “నీ బ్యాటింగ్ చూసి నీ నాన్న గర్వంగా ఉన్నారు.. కానీ అవుట్ అయిన తర్వాత కోచ్‌లకు  నమస్కారం చేయలేదని అడుగుతున్నారు” అని చెప్పారు. దీనికి స్పందించిన వైభవ్, “అవుట్ అయిన తర్వాత సీనియర్లు ఉన్నారు.. ఆ సమయంలో వేరే ఆలోచనలో ఉండి నమస్కారం చేయడం మర్చిపోయాను. నాన్న ఫోన్ చేస్తే తప్పకుండా క్లాస్ పడుతుంది.. అందుకే ముందే సారీ చెబుతున్నాను” అంటూ కెమెరా ముందు చేతులు జోడించి క్షమాపణ చెప్పాడు. ఈ వినయపూర్వక స్పందన అభిమానుల హృదయాలను తాకింది.

Vaibhav Suryavanshi Century | గత మ్యాచ్‌లో చీలమండకు గాయం

ఇదిలా ఉంటే, మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. బంతిని ఆపే ప్రయత్నంలో అతని కాలి కండరం పట్టేయడంతో మైదానం విడిచి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత అతను స్పందిస్తూ, “గత మ్యాచ్‌లో చీలమండకు గాయం అయింది. దాని ప్రభావం వల్ల హ్యామ్‌స్ట్రింగ్ సమస్య వచ్చింది. ప్రస్తుతం ఫిజియోల పర్యవేక్షణలో ఉన్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని వచ్చే మ్యాచ్‌కు సిద్ధమవుతాను” అని తెలిపాడు. చిన్న వయస్సులోనే ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై తన ప్రతిభను చాటుతున్న వైభవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాటింగ్‌లో దూకుడు, వ్యక్తిత్వంలో వినయం కలగలిసిన ఈ యువ ఆటగాడు భవిష్యత్ భారత క్రికెట్ స్టార్‌గా ఎదుగుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజింక్య రహానే (Ajinkya Rahane) కూడా వైభవ్ ఇన్నింగ్స్‌ను ప్రశంసిస్తూ అతని క్రమశిక్షణను కొనియాడారు.

ఇది కూడా చదవండి..: Lungi Ngidi Injury | లుంగీ ఎంగిడికి తప్పిన ప్ర‌మాదం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *