అక్షరటుడే, వెబ్‌డెస్క్: Venezuela Earthquake | గత నెల వెనిజులాను వణికించిన శక్తివంతమైన వరుస భూకంపాల విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరుగుతూ ఉండటం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
Mexico Earthquake 6.0 | మెక్సికో తీరంలో మరో భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
Venezuela Earthquake | అత్యధికంగా లా గ్వైరా ప్రభావితం
తాజా అధికారిక వివరాల ప్రకారం, ఈ రెండు భారీ భూకంపాల కారణంగా ఇప్పటివరకు 5,069 మంది ప్రాణాలు కోల్పోగా, 16,740 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా, శిథిలాల కింద నుంచి మృతదేహాలు వెలికితీస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
కరీబియన్ సముద్రానికి ఆనుకుని ఉన్న లా గ్వైరా రాష్ట్రం అత్యధికంగా ప్రభావితమైంది. ఇక్కడే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక బృందాలు శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి.
Venezuela Earthquake | భయాందోళనల నడుమే జీవనం
జూన్ 24న సంభవించిన 7.2, 7.5 తీవ్రత గల భూకంపాల తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1,331 అనంతర ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదవడంతో ప్రజలు ఇంకా భయాందోళనల మధ్యనే జీవనం సాగిస్తున్నారు.
ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ విపత్తులో 856 భవనాలు దెబ్బతినగా.. వాటిలో 190 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. వంతెనలు, రహదారులు సహా పలు కీలక మౌలిక వసతులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు నిర్వహించడం అధికారులకు సవాలుగా మారింది.

Venezuela Earthquake | తాత్కాలిక శిబిరాల్లోనే ఆశ్రయం
ఇళ్లు కోల్పోయిన వేలాది కుటుంబాలు తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నాయి. బంధువులను కోల్పోయిన కుటుంబాల ఆవేదన, శిథిలాల మధ్య తమ జీవితాలను మళ్లీ నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రజల పోరాటం వెనిజులాలోని విషాదాన్ని మరింత హృదయవిదారకంగా మారుస్తోంది.
సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.