Voter List Revision | ఓటరు లిస్టులో పేరుందా..? లేదంటే దరఖాస్తుకు మరో ఛాన్స్​!

ఓటు హక్కు లేని వారికోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Voter List Revision | ఓటు హక్కు ఉన్నా.. జాబితాలో పేరు కనిపించడం లేదా..? నివాసం మారిందని, అందుబాటులో లేరని మీ పేరు ఏఎస్డీడీ(ASDD) జాబితాలో చేరిందా..? అయితే అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)(SIR) ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు ఏఎస్డీడీ జాబితాలోకి చేరాయి.

Voter List Revision | నిజామాబాద్​ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో 2,11,670 మంది, కామారెడ్డి జిల్లాలో 84,268 మంది.. మొత్తం 2,95,938 మంది ఏఎస్డీడీ జాబితా(ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి లేదా విచారణకు గుర్తించిన ఓటర్ల జాబితా)లో ఉన్నారు. వీరిలో అర్హులైన వారు తమ వివరాలను అధికారుల వద్ద ధ్రువీకరించుకుని ఓటు హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Voter List Revision | రెండు జిల్లాల్లో భారీ సంఖ్యలో..

జిల్లాల వారీగా పరిశీలిస్తే నిజామాబాద్‌లో 2.11 లక్షల మందికిపైగా, కామారెడ్డిలో 84 వేల మందికిపైగా ఓటర్లు ఏఎస్డీడీ జాబితాలో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జాబితాలో గైర్హాజరు, శాశ్వతంగా నివాసం మారినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు నమోదు చేసుకున్నవారు ఉంటారు. అయితే జాబితాలో పేరు ఉండటం వల్ల సంబంధిత వ్యక్తి ఓటు హక్కు కోల్పోయినట్లు కాదు. అర్హత ఉన్నప్పటికీ సవరణ ప్రక్రియలో వివరాలు నమోదు కాకపోయినవారు తగిన ఆధారాలతో తమ పేరును తిరిగి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

Voter List Revision | మరో అవకాశాన్ని వినియోగించుకోవాలి..

తొలుత నవంబరు 21 వరకు గడువు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో ఏఎస్డీడీ జాబితాలో ఉన్నవారికి నవంబరు 30 వరకు అవకాశం కల్పించింది. నవంబరు 18 నుంచి 30 వరకు ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, స్వీకరణ చేపట్టనున్నారు. సంబంధిత ఓటర్లు తమ ప్రాంత బూత్‌ స్థాయి అధికారి (బీఎల్ఓ)ను సంప్రదించి వివరాలు సమర్పించాలి. గతంలో ఫారం అందించలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ అవసరమైన వివరాలు, ఆధారాలు అందించాలి. కుటుంబ సభ్యుల ద్వారా కూడా సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత ప్రత్యేక సవరణ ప్రక్రియలో తమ పేరు చేర్చుకునే అవకాశం చేజారవచ్చు.

మార్పులు.. చేర్పులకు మరో గడువు..

ముసాయిదా ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా, చిరునామా మారినా సంబంధిత ఎన్నికల నమోదు అధికారి , సహాయ ఎన్నికల నమోదు అధికారి ను సంప్రదించాలి. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి డిసెంబరు 15 వరకు గడువు ఉంది. ఏఎస్డీడీ జాబితాలో ఉన్నవారి ఎన్యుమరేషన్‌ ఫారాల స్వీకరణకు నవంబరు 30 చివరి తేదీ కాగా.. ఇతర క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు డిసెంబరు 15 వరకు అవకాశం కల్పించారు. ఈ రెండు గడువుల మధ్య తేడాను ఓటర్లు గుర్తించాలి. తుది ఓటరు జాబితాను డిసెంబరు 22న ప్రచురించనున్నారు.

ఆన్‌లైన్‌లోనూ పరిశీలించుకోవచ్చు

ఓటర్లు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, ఈసీఐనెట్‌ యాప్‌ ద్వారా తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవచ్చు. ఎపిక్‌ నంబరుతో ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలుంటే బీఎల్ఓను సంప్రదించడంతోపాటు ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి వివరాలు పొందవచ్చు. వలస వెళ్లిన కుటుంబాలు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు, వృద్ధులు, తమ ప్రాంతంలో అందుబాటులో లేని ఓటర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకూడదు

ఓటరు జాబితాలో పేరు లేకపోవడం వల్ల అర్హులైన పౌరులు తమ ఓటు హక్కుకు దూరం కాకుండా ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. గ్రామాలు, పట్టణాల్లో బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలియజేయడంతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాలి. రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు కూడా ఓటర్లకు సహకరించాలి. ఉమ్మడి జిల్లాలో దాదాపు మూడు లక్షల మంది పేర్లు ఏఎస్డీడీ జాబితాలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలి. అర్హులైన ఒక్క ఓటరు కూడా నిర్లక్ష్యం కారణంగా జాబితాలో చోటు కోల్పోకుండా ఇప్పుడున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: దక్షిణాఫ్రికా తీరంపై విరుచుకుపడుతున్న భారీ అలలు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *