అక్షరటుడే వెబ్‌డెస్క్ : 22A Land Restrictions | నిబంధనలకు విరుద్ధంగా ప్రజల ఆస్తులను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ( Harish Rao ), మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళవారం మల్కాజ్‌గిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బాధితులతో కలిసి భారీ సమావేశం నిర్వహించారు. ఈ జాబితాను తక్షణమే రద్దు చేసి, ఆస్తుల క్రయవిక్రయాలకు వెంటనే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
22A Land Restrictions | అమ్ముకోలేక అవస్థలు..
మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోనే సుమారు 30 వేల కుటుంబాలు 22A నిబంధన కారణంగా రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవితకాల కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాలు, ఇళ్లను పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య అవసరాల కోసం అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే వరకు తమ భూమి నిషేధిత జాబితాలో ఉందనే విషయం ప్రజలకు తెలియకపోవడం శోచనీయమని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని కోరారు.
22A Land Restrictions | శ్వేతపత్రం విడుదల చేయాలి..
ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే కొత్త సమస్యలను సృష్టిస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. 2008లోనే యూఎల్‌సీ రద్దయి పట్టా భూములుగా మారిన భూములను, జీవో 7500 ద్వారా మినహాయింపు పొందిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల భూములను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. తప్పు చేసి కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 22Aలో చేర్చిన , తొలగించిన భూముల వివరాలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
22A Land Restrictions | అసెంబ్లీ వేదికగా పోరాటం..
బాధితులు మళ్లీ ఎక్కడా దరఖాస్తులు చేసుకునే ఇబ్బంది లేకుండా, ప్రభుత్వమే స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నిషేధిత జాబితా నుంచి ప్రైవేట్ ఆస్తులను తొలగించాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ అంశంపై శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని, ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, పలు కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు , బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్