Tempsens Instruments IPO | భారీగా జీఎంపీ.. ఐపీవో అప్లై చేసేద్దామా..

టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ఐపీవో గురువారంనుంచి ప్రారంభం కానుంది. ఈ కంపెనీ షేర్లకు జీఎంపీ 53 శాతంగా ఉంది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tempsens Instruments IPO | థర్మల్ ఇంజినీరింగ్, ప్రత్యేక కేబుల్ తయారీలలో అగ్రగామి సంస్థలలో టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ఒకటి. దీనిని 1990లో స్థాపించారు. ఈ కంపెనీ కస్టమైజ్డ్ టెంపరేచర్ సెన్సింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్, ప్రత్యేక కేబుల్స్ రూపకల్పన మరియు తయారీలో నిమగ్నమై ఉంది. ఈ ఉత్పత్తులను ఉక్కు, సిమెంట్, పెట్రోకెమికల్స్, విద్యుత్ ఉత్పత్తి, ఆటోమోటివ్, గాజు వంటి విభిన్న పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

Tempsens Instruments IPO | 80 కిపైగా దేశాలకు..

టెంప్సెన్స్ తన అనుబంధ సంస్థలు మరియు జాయింట్ వెంచర్ల ద్వారా భారతదేశంతోపాటు ఇండోనేషియా, యూఏఈ, పోలాండ్, జర్మనీ, దక్షిణ కొరియాలో ఉన్న తన తయారీ కేంద్రాల నుంచి థర్మల్ ఇంజినీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఈ సంస్థకు సంక్లిష్టమైన, కీలకమైన పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో, వినియోగదారులతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడంలో, తన విభిన్న వినియోగదారుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉనికిని పెంచుకోవడంలో అనుభవం ఉంది. 80కి పైగా దేశాలకు తన ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.

Tempsens Instruments IPO | ఐపీఓ పరిమాణం రూ. 650 కోట్లు..

ఈ కంపెనీ మార్కెట్‌నుంచి రూ. 650 కోట్లు సమీకరించడం కోసం ఐపీవో (IPO)కు వస్తోంది. ఇందులో రూ. 95 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా, మిగిలిన మొత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో సమీకరించనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని కంపెనీ తన ఎలక్ట్రికల్ హీటింగ్ సొల్యూషన్స్, స్పెషలైజ్డ్ కేబుల్ వ్యాపారాలలో మూలధన వ్యయం కోసం రూ. 18.1 కోట్లను ఉపయోగించాలని యోచిస్తోంది. మిగిలిన మొత్తాన్ని రుణ భారాన్ని తగ్గించుకోవడం కోసం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు తెలిపింది.

Tempsens Instruments IPO | ధరల శ్రేణి..

కంపెనీ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ. 285 నుంచి రూ. 300 గా నిర్ణయించింది. లాట్ సైజు 50. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 15 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్లు వేయొచ్చు.

కోటా : క్యూఐబీలకు 50 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు.

జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో షేరు రూ. 160 ప్రీమియంతో ఉంది. అంటే లిస్టింగ్ సమయంలో 53 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.

ముఖ్యమైన తేదీలు : టెంప్సెన్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 20న ప్రారంభమై 24న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ ఆగస్టు 25న రాత్రి వెలువడనుంది. కంపెనీ షేర్లు ఆగస్టు 27న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టవుతాయి. యాంకర్ బుక్ ఒక రోజు ముందుగా అంటే ఆగస్టు 19న ప్రారంభమవుతుంది.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | క్రూడ్ కుతకుత.. ఆరో రోజూ నష్టాల్లోనే సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *