Stock Market Losses | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు.. ఆరో రోజూ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమ ఆసియాలో నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్‌తో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ట స్థాయిల వద్ద కొనసాగితే ద్రవ్యోల్బణం అధికమై.. దాని ప్రభావం దేశీయ స్థూల, కార్పొరేట్ ఆదాయాలపై పడుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతోంది. వరుసగా ఆరో సెషన్‌లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది.

Stock Market Losses | గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం ఉదయం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 310 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే కోలుకుని 157 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 341 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 46 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 115 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 492 పాయింట్ల నష్టంతో 77,235 వద్ద, నిఫ్టీ 132 పాయింట్ల నష్టంతో 24,154 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Losses | ఐటీలో మూడో రోజూ నష్టాలు..

భౌగోళిక రాజకీయ ఆందోళనల నేపథ్యంలో ముడి చమురు ధరలు, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుండడం వంటి అంశాలు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో టెక్నాలజీ స్టాక్స్ వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.84 శాతం నష్టపోయింది.

Stock Market Losses | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,930 కంపెనీలు లాభపడగా 2,384 స్టాక్స్ నష్టపోయాయి. 216 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 180 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 91 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్ లాభపడగా.. 22 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్ 0.89 శాతం, పవర్‌గ్రిడ్ 0.66 శాతం, ఎంఅండ్ ఎం 0.47 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.27 శాతం, ఎల్టీ 0.15 శాతం లాభపడ్డాయి.

Top Losers : ఆసియన్ పెయింట్ 2.40 శాతం, ఇన్ఫోసిస్ 2.02 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.93 శాతం, ఎయిర్‌టెల్ 1.75 శాతం, టీసీఎస్ 1.47 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Tempsens Instruments IPO | భారీగా జీఎంపీ.. ఐపీవో అప్లై చేసేద్దామా..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *