Rah Veer Puraskar | ప్రాణాలు కాపాడితే రూ.25 వేల నజరానా : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Rah Veer Puraskar | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ‘గోల్డెన్ అవర్‌’లో ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ప్రకటించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో రహదారి వీరుల పథకంపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Rah Veer Puraskar | ప్రమాదం జరిగిన వెంటనే..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ రహదారి వీరులుగా మారాలని పిలుపునిచ్చారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీని (District Appreciation Committee) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ, డీటీవో (DTO), డీఎంహెచ్​వో (DMHO) సభ్యులుగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రోడ్డు ప్రమాదం జరిగి చావుబతుకుల మధ్య ఉన్న వారి ప్రాణాన్ని కాపాడితే ప్రభుత్వం ఇచ్చే రూ.25 వేలు కేవలం గుర్తింపు మాత్రమేనన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం కూడా ప్రాణం తీస్తుందని, సకాలంలో స్పందించే వ్యక్తి చొరవ ఒక కుటుంబానికి దీపం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు ప్రజలు, అధికారులు కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. రహదారి వీరుల పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.

Rah Veer Puraskar | ఆక్రమణలను ఉపేక్షించేది లేదు..

రోడ్డు పక్కన ఆక్రమణలే ప్రమాదాలకు కారణం అవుతున్నాయని, వాటిని ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పష్టం చేశారు. జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైవేల వెంట హోటళ్లు, ధాబాలు ఇష్టారీతిన ఏర్పాటు చేసుకున్న అనధికార ప్రవేశ మార్గాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకుండా వేసిన ప్రతి అడ్డదారీ ఒక నిండు ప్రాణం తీస్తోందని, ఇక నుంచి రాకపోకలు రూల్స్ ప్రకారమేనని హెచ్చరించారు. జాతీయ రహదారులపై జంతువులు అడ్డొచ్చి జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జంతువుల అండర్‌పాస్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు.

Rah Veer Puraskar | అటవీప్రాంతంలో..

అటవీ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి అనుమతులను త్వరగా తెప్పించాలని అటవీ, ఆర్అండ్​బీ శాఖలకు సూచించారు. సదాశివనగర్ మండలం మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ (Gayatri Sugar Factory) వంటి ప్రమాదకర మలుపుల వద్ద రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్‌లు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలకు గురయ్యే ప్రతి చోటా భద్రతా సూచిక ఉండాల్సిందేనని చెప్పారు. ప్రజల ప్రాణ భద్రతే మొదటి ప్రాధాన్యమని, రవాణా, పోలీస్, ఆర్ అండ్​బీ, ఎన్‌హెచ్‌ఏఐ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను సగానికి సగం తగ్గించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, డీటీవో శ్రీనివాస్, ఎన్‌హెచ్‌ఏఐ, అటవీ, ఆర్అండ్​బీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Rah Veer Puraskar

kamareddy 4

ఇది కూడా చదవండి: DK Shivakumar CM | డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి తేదీ ఖరారు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *