Raghunandan Rao | రేవంత్ రెడ్డికి అవే లాస్ట్ ఎలక్షన్స్.. కూనంనేని సీటు కూడా మేమే గెలుస్తాం: రఘునందన్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghunandan Rao | తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవే చివరి ఎన్నికలు అవుతాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ( Raghunandan Rao )సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను తట్టుకోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Raghunandan Rao | బీజేపీని టార్గెట్ చేస్తున్నారు..

సొంత పార్టీని కాపాడుకోలేక చేతులెత్తేసిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే బీజేపీని టార్గెట్ చేస్తున్నారని రఘునందన్ రావు విమర్శించారు. చిట్‌చాట్‌ల పేరుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ బీజేపీపై లేనిపోని అపవాదులు వేయడం బాధాకరమన్నారు. ‘జై తెలంగాణ’ నినాదాన్ని వాడుకుంటూ ఇతర పార్టీలపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. గతంలో ఆంధ్ర ప్రజల గురించి బీఆర్ఎస్ ఎన్నో రకాలుగా మాట్లాడిందని గుర్తు చేసిన ఆయన.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారనే కోపంతోనే జనం బీఆర్ఎస్‌ను ఓడించి ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
ragunandhan.1

 

Raghunandan Rao | కూనంనేని సవాల్ స్వీకరిస్తున్నాం..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విసిరిన ఛాలెంజ్‌పై రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. “తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము సీపీఐకి ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు ఎప్పుడో పక్కనబెట్టేశారని, సొంతంగా నిలబడే సత్తా ఆ పార్టీలకు లేదని విమర్శించారు. కూనంనేని సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, చివరికి కూనంనేని ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును కూడా బీజేపీనే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల బలమే తమ శక్తి అని, ‘అంత్యోదయ’నే తమ సిద్ధాంతమని స్పష్టం చేశారు.

ragunandhan.2

Raghunandan Rao | కాంగ్రెస్ అవినీతిపై పోరాటం..

దేశంలోని అన్ని రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోడీ సమానంగా చూస్తున్నారని రఘునందన్ రావు కొనియాడారు. కాంగ్రెస్‌కు, బీజేపీకి అస్సలు పొంతన లేదని.. కాంగ్రెస్ తూర్పు అయితే బీజేపీ పడమర లాంటిదని పేర్కొంటూ.. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, వారు చేసిన తప్పులకు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లోనే బీజేపీ జెండా పాతామని, అలాంటిది తెలంగాణలో బీజేపీ విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి పోలింగ్ బూత్‌లో ఒంటరిగానే గెలిచేందుకు తమ శ్రేణులు కృషి చేస్తున్నాయని రఘునందన్ రావు తెలిపారు.

ఇది కూడా చదవండి: Harishrao Birthday | ఆర్​కే ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఘనంగా హరీశ్​రావు జన్మదిన వేడుకలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *