Economic Tsunami Debate | నిజమైన ఆర్థిక సునామీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది: అమిత్ మాలవీయ

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Economic Tsunami Debate | దేశంలో త్వరలోనే ‘ఆర్థిక సునామీ’ రాబోతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రజలను భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని మండిపడింది. నిజమైన ఆర్థిక సునామీ కాంగ్రెస్ హయాంలో.. అంటే 2013లోనే వచ్చిందని, ఇప్పుడు కాదంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ కౌంటర్ ఇచ్చారు.

Economic Tsunami Debate | రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..

అంతకుముందు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయని ఆరోపించారు. భవిష్యత్తులో ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోలేక మోదీ ప్రభుత్వం దేశంలో ‘ఎమర్జెన్సీ’ (అత్యవసర స్థితి) విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
malaviya.1

Economic Tsunami Debate | యూపీఏ హయాంలోనే సంక్షోభం..

రాహుల్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ అమిత్ మాలవీయ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా గట్టి చురకలు వేశారు. “రాహుల్ గాంధీ చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు అస్సలు సంబంధం లేదు. కాంగ్రెస్ దేశాన్ని వినాశనం వైపు తీసుకెళ్తే.. బీజేపీ బలోపేతం చేసింది. నిజానికి 2011 నుండి 2013 మధ్య కాలంలో దేశీయ రూపాయి విలువ ఏకంగా 36 శాతం పడిపోయింది. విదేశీ మారక నిల్వలు 294 బిలియన్ డాలర్ల నుండి 256 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. అసలైన ఆర్థిక సునామీ వచ్చింది అప్పుడే” అని మాలవీయ గుర్తు చేశారు.

malaviya.2

Economic Tsunami Debate | భారత్ ఇప్పుడు దృఢంగా ఉంది..

ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై మాలవీయ స్పష్టతనిస్తూ.. “ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా భారత్ నిస్సహాయంగా లేదు. గడిచిన పదేళ్లలో ఎలాంటి షాక్‌లనైనా తట్టుకునేలా దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం బలోపేతం చేసింది. దేశంలో విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఈవే బిల్ జనరేషన్ పెరిగింది, ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. మన దగ్గర సరిపడా ఆహార ధాన్యాలు, విదేశీ మారక నిల్వలు ఉన్నాయి” అని పేర్కొన్నారు.

కోవిడ్ సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనా భారత్ బలంగా నిలబడిందని, కాబట్టి రాహుల్ గాంధీ ఇకనైనా ప్రజలను భయపెట్టి రాజకీయం చేయడం ఆపాలని ఆయన హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Telangana Weather Alert | నేడు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో తుఫాను.. హైదరాబాద్‌కూ అలర్ట్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *