E100 Ethanol Fuel | ఇక వంద శాతం ఇథనాల్ ఇంధనం!

దేశంలో వంద శాతం ఇథనాల్ ఇంధన వినియోగానికి సంబంధించిన కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో దేశంపై ఇంధన దిగుమతుల భారం కొంత తగ్గనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : E100 Ethanol Fuel | భారత్‌లో దేశీయ అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు లేకపోవడంతో ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. జియో పొలిటికల్ టెన్షన్స్‌తో ప్రపంచ చమురు ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దిగుమతుల భారం పెరిగి వాణిజ్య లోటు పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో దిగుమతుల భారాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. పెట్రోల్ లో ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహిస్తూ వస్తున్న సర్కారు.. వందశాతం ఇథనాల్ ఇంధన వినియోగానికీ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో మారుతి సుజుకీ, టొయోటా, ఎంజీ, హ్యుందాయ్ వంటి ఆటోమోబైల్ సంస్థలు ఈ100 ఇంధనంతో నడిచే వాహనాలు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

E100 Ethanol Fuel | సర్కారు ఆమోదం..

భారత్‌లో ఇప్పటికే ఈ20 పెట్రోల్‌ను వాహనదారులు వినియోగిస్తున్నారు. అంటే దీనిలో 20శాతం ఇథనాల్, 80శాతం పెట్రోల్ ఉంటుంది. దీనిని వందశాతానికి పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సాగుతోంది. ఇథనాల్‌తో నడిచే వాహనాల తయారీకి మార్గం సుగమం చేస్తూ వంద శాతం ఇథనాల్ (ఈ100) నిబంధనలకు ఇటీవల కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో భవిష్యత్తులో పెట్రోల్ స్థానంలో పూర్తిగా ఇథనాల్ ఇంధనంతో నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఇది పెట్రోల్ ధరలను అదుపు చేయడమే కాకుండా ఇతర దేశాల నుంచి క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకునే భారాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు.

E100 Ethanol Fuel | ప్రయోజనాలెన్నో..

ఇథనాల్ తయారీలో కీలకమైన చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు డిమాండ్ ఏర్పడి రైతులకు కూడా మేలు జరనుంది.
ఈ ప్రత్యామ్నాయ ఇంధనంతో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గి గాలి కాలుష్యం కూడా తగ్గుతుంది.
పెట్రోల్ కన్నా ఇథనాలు తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. దీంతో వాహనదారులపై పెట్రోల్ భారం తగ్గుతుంది.

E100 Ethanol Fuel | ప్రతికూలాంశాలు..

సాధారణ పెట్రోల్ తో పోల్చితే ఇథనాల్ లో శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో మైలేజ్ తగ్గుతుంది.
ఇథనాల్‌కు తేమను గ్రహించే గుణం ఉంటుంది. దీనివల్ల ఇంజిన్‌లోని భాగాలు తుప్పుపట్టే అవకాశం ఉంటుంది.
ఇథనాల్ బంక్‌లు అందుబాటులో లేవు. పెద్ద ఎత్తున ఈ100 ఇంధనాన్ని నిర్వహించగల నిల్వ, పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనికి భారీగా పెట్టుబడులు అవసరం.

ఇది కూడా చదవండి..: UPSC Prelims Results 2026 | సివిల్స్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. మెయిన్స్‌కు 13,343 మంది ఎంపిక

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *