Mini Countryman C | స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో.. బీఎండబ్ల్యూ నుంచి ప్రీమియం కారు లాంచ్

ఆటోమొబైల్ రంగంలో స్టైలిష్ లుక్, లగ్జరీ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త క్రాసఓవర్ మోడల్ మినీ కంట్రీమ్యాన్ సీ కారును తీసుకువచ్చింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mini Countryman C | లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బీఎమ్‌డబ్ల్యూ.. దేశీయ మార్కెట్‌ (Domestic market)లో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ సరికొత్త ప్రీమియం కారును తీసుకువచ్చింది. ‘మినీ కంట్రీమ్యాన్ సీ’ క్రాసఓవర్ కారును బుధవారం విడుదల చేసింది.

లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మరింత గట్టి పోటీ ఇచ్చేందుకు వీలుగా కంపెనీ ఈ కారును డిజైన్ చేసింది. పూర్తిస్థాయి విడిభాగాలు దిగుమతి చేసుకుని చెన్నైలోని ప్లాంటులో అసెంబుల్ చేస్తున్నారు. దేశీయంగా అసెంబ్లింగ్ చేసిన ఈ కారు పరిచయ ధర (ఎక్స్‌షోరూమ్)ను రూ. 47.50 లక్షలుగా నిర్ణయించింది. పాత ఇంపోర్టెడ్ మోడల్ కంటే ఈ కొత్త వేరియంట్ ధర ఏకంగా రూ.17.4 లక్షలు తగ్గడం గమనార్హం. దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలను సైతం తక్షణమే ఇవ్వనున్నారు.

డిజైన్ : డిజైన్ పరంగా ఈ సరికొత్త కంట్రీమ్యాన్ సీ గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న మినీ బ్రాండ్ లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్, స్క్వేర్ ఆఫ్ ప్రపోర్షన్స్,రీప్రొఫైల్డ్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, అడాప్టివ్ ఎలఈడీ హెడ్‌ల్యాంప్స్, ప్రత్యేకమైన షాంపేన్ కలర్ ఎక్స్‌టీరియర్ ట్రిమ్‌తో ఈ కారు ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. పాత మోడల్స్ కంటే ఇందులో క్యాబిన్ విశాలంగా ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-1 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), 360 డిగ్రీల కెమెరాతో కూడిన పార్క్ అసిస్టెంట్ ప్లస్, 12 స్పీకర్ల ప్రీమియం ‘హార్మన్ కార్డన’ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి.
ఈ కారు దాదాపు 4.4 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉండటంతో పాటు లాంగ్ వీల్‌బేస్‌తో వస్తుంది. దీనివల్ల వెనుక సీట్లో కూర్చునే వారికి మంచి లెగ్‌రూమ్ లభిస్తుంది. లగేజ్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్ కూడా బాగా పెరిగింది.

Mini Countryman C | ఇంజిన్ సామర్థ్యం..

Mini Countryman C

ఈ కారులో 1.5 లీటర్, 3 సిలిండర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. బీఎమ్‌డబ్ల్యూ ‘ఎక్స1’లో వాడిన ‘ఫ్రంట్ వీల్ డ్రైవ్ యూకేఎల్2’ ప్లాట్‌ఫాంపైనే దీనిని కూడా రూపొందించారు. ఇది 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజిన్ గరిష్టంగా 154 హార్స్‌పవర్, 240 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టాప్ స్పీడ్ గంటకు 212 కిలోమీటర్లు.

Mini Countryman C | ఐదు రంగుల్లో..

కస్టమర్ల కోసం కంపెనీ ఈ కారును ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. చిల్లీ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, నానుక్ వైట్, స్లేట్ బ్లూ, స్మోకీ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఇది పాపులర్ లగ్జరీ కార్లయిన బీఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ ఏ వంటి మోడళ్లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market Losses | స్వల్ప నష్టాల్లో సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
4 Comments