Srinivas Yadav Congress | కాంగ్రెస్‌లో ‘సొంత’ కుంపటి: సీఎం రేవంత్‌పై AICC నేత శ్రీనివాస్ యాదవ్ తిరుగుబాటు బావుటా!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Srinivas Yadav Congress | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తీవ్ర అసంతృప్తి మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష వైఖరి, పార్టీలోని సామాజిక సమీకరణాలపై AICC ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్‌ శ్రీనివాస్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దావానలంలా మారాయి.

రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో తూర్పారబడుతూ ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు పార్టీలో పెను తుఫానును సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.

Srinivas Yadav Congress | ‘గేట్లు తెరవడం లేదు.. అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదు!’

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి నాకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు.. నేను వెళ్తే సెక్రటేరియట్ గేట్లు కూడా తెరవడం లేదు”

అంటూ స్వయంగా ఒక అధిష్ఠాన పెద్దే వాపోవడం కాంగ్రెస్ మార్క్ ‘ప్రజా పాలన’పై పెద్ద ప్రశ్న గుర్తుగా నిలిచింది. సొంత పార్టీ కీలక నేతలకే ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం లేదన్న విమర్శ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారనుంది.

Srinivas Yadav Congress | రెడ్డి వర్సెస్ బీసీ, మైనారిటీ

పార్టీలో సామాజిక వివక్ష ఉందంటూ శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బగా మారే ప్రమాదం ఉంది.

కుల వివక్ష: “రెడ్డి సామాజికవర్గం వారు కాంగ్రెస్ పార్టీని అమ్మనా బూతులు తిట్టినా ఏం అనరు.. అదే బీసీ, మైనారిటీ నాయకులు మాట్లాడితే మాత్రం తక్షణమే నోటీసులు ఇస్తారు” అంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.

మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ రేవంత్: రేవంత్ రెడ్డి కంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గొప్పోడంటూ వ్యాఖ్యానించడం ద్వారా, సీఎం వైఖరిపై బీసీ నేతల్లో ఉన్న అసంతృప్తిని ఆయన బహిర్గతం చేశారు.

cm revanth reddy 1

Srinivas Yadav Congress | “సీఎం రేవంత్‌పై ఎద్దేవా”

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమను శ్రీనివాస్ యాదవ్ పూర్తిగా తక్కువ చేసి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ తన సొంత ఎంపీ స్థానమైన మల్కాజ్‌గిరిని గెలిపించుకోలేకపోయారని, అలాగే సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్ ఎంపీ సీటును కూడా కాపాడుకోలేకపోయారంటూ ఘాటైన విమర్శలు చేశారు. సొంత ఇలాకాలోనే పట్టులేని రేవంత్.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఎలా నడిపిస్తారనే కోణంలో విమర్శలు గుప్పించారు.

Srinivas Yadav Congress | కారు ఖాళీ అవ్వడం కాదు.. హస్తం నుంచి ‘ఐదుగురు ఎమ్మెల్యేలు’ జంప్?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయంటూ ఇన్నాళ్లూ ప్రచారం జరుగుతుంటే.. శ్రీనివాస్ యాదవ్ మాత్రం సీన్ రివర్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పరిణామాల వల్ల, మనస్పర్థల కారణంగా ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఛైర్మన్లు పార్టీని వీడటానికి సిద్ధంగా ఉన్నారంటూ బాంబు పేల్చారు.

గతంలో జీవన్ రెడ్డి శిష్యుడి హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, పార్టీలో నేతలకు రక్షణ లేదనే భావన వ్యక్తం చేశారు. ‘సైకిల్ కాంగ్రెస్’ (టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలు) నేతలను టార్గెట్ చేస్తూ.. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

Srinivas Yadav Congress | బండి సంజయ్ కొడుకు అరెస్ట్‌పై డబుల్ స్టాండర్డ్స్!

రాష్ట్రంలో చట్టం అందరికీ ఒకేలా అమలు కావడం లేదని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కావడ వల్లే అరెస్ట్ చేయడానికి 10 రోజులు లేట్ చేశారని, అదే ఒక సామాన్యుడు అయితే వెంటనే లోపల వేసేవారు కాదా అని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగట్టారు.

అంతర్గత విభేదాలు

AICC నేత శ్రీనివాస్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో “వలస నేతలు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్”, “రెడ్డి వర్సెస్ బీసీ” లొల్లిని స్పష్టంగా చూపిస్తున్నాయి. లోపల జరుగుతున్న అంతర్గత యుద్ధాన్ని ఆయన ఒక్కసారిగా రచ్చకీడ్చారు.

ఒకవైపు చేరికలతో బలం పెంచుకుంటున్నామని సీఎం రేవంత్ భావిస్తుంటే.. సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అధిష్ఠాన నేత ప్రకటించడం కాంగ్రెస్‌ హైకమాండ్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. దీనిపై అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, రేవంత్ వర్గం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telangana Education Budget | కుర్చీలు మారినా.. క్లాస్​రూం తలరాత మారలే: బడ్జెట్​లో విద్యకు​ కేటాయింపులపై ప్రొఫెసర్ ఎంఏ​ మాలిక్​ విమర్శ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *