Child Online Safety | డిజిటల్ యుగంలో పిల్లల రక్షణే లక్ష్యంగా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

హైదరాబాద్ వేదికగా జరిగిన 'నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)' దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Child Online Safety | హైదరాబాద్ వేదికగా జరిగిన ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA)’ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ డిజిటల్ యుగంలో పిల్లల సైబర్ భద్రత చాలా కీలకమని, వారి రక్షణ కోసం త్వరలోనే ఒక సమగ్ర ‘చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్’ను తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. రూపాయి లేని పేదవాడికి కూడా ఉచితంగా న్యాయం అందాలనే ఉద్దేశంతో న్యాయ సేవా సంస్థలు పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు.

Child Online Safety| భద్రతపై ఆందోళన..

పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ, అక్కడ పొంచి ఉండే ప్రమాదాలను గుర్తించే అవగాహన వారికి ఉండదని, పెరిగిన డిజిటల్ నేరాల నేపథ్యంలో వారిని రక్షించే బాధ్యత అందరిపై ఉందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసిన ఆయన.. బాధితులకు ఒకే చోట అన్ని సేవలు అందించేలా భరోసా కేంద్రాలు, దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు, CybHER యాప్ ద్వారా విద్యార్థులను ‘సైబర్ అంబాసిడర్లు’గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. TGS-LSA ద్వారా ఉపాధ్యాయుల సాయంతో పిల్లలకు చట్టపరమైన హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

Child Online Safety| తల్లిదండ్రులకు సూచనలు ..

పిల్లలతో ప్రతిరోజూ స్నేహపూర్వకంగా మాట్లాడుతూ, వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో గమనిస్తూ సరైన మార్గదర్శకత్వం అందించాలని కోరారు. సైబర్ నేరాల కోసం 1930, చైల్డ్ హెల్ప్ లైన్ కోసం 1098 నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. న్యాయం అంటే కేవలం నేరస్థులకు శిక్ష పడటమే కాదని, బాధితుడి గౌరవాన్ని, చిన్నారి కోల్పోయిన బాల్యాన్ని తిరిగి ఇవ్వడమేనని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ హైకోర్టు, టీజీఎస్-ఎల్ఎస్ఏ భాగస్వామ్యంతో ఈ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని గ్రామ స్థాయి వరకు న్యాయ సేవలను విస్తరిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

 

 

ఇది కూడా చదవండి: Hitech City Train Halt | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పండుగ రద్దీకి చెక్ పెట్టేలా రైల్వే శాఖ కీలక నిర్ణయం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *