అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipality | రాష్ట్రంలోనే కామారెడ్డి (Kamareddy) బల్దియా తీరే వేరు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వెలుస్తున్న వెంచర్లు, కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు వసూళ్లరాయుళ్లకు వరంగా మారుతున్నాయి. వసూళ్ల కోసం షాడో కౌన్సిలర్లు టీములుగా ఏర్పడ్డారన్న టాక్ బల్దియాలో చక్కర్లు కొడుతోంది. పార్టీ ఏదైనా, ఒకే పార్టీలో గ్రూపులు ఉన్నా చేసే పనిలో వాటా దొరికితే అంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
రెవెన్యూ స్థలాన్ని వెంచర్‌గా మార్చే క్రమంలో అక్కడక్కడా పొరపాట్లు జరగడం సహజమే. అలాగే కొత్తగా నిర్మించే భవనానికి సరైన అనుమతులు తీసుకోకపోవడం కూడా నిజమే. అయితే అధికారుల నుంచి అనుమతులు రావడానికి ఆలస్యం కావడం, కొంతమంది నాయకుల ప్రోద్బలంతో అనుమతులు లేకున్నా వెంచర్లు ఏర్పాటు చేయడం, భవనాల నిర్మాణం చేపట్టడం పరిపాటిగా మారుతోంది. ఈ అనుమతులు లేకపోవడం, చిన్నపాటి పొరపాట్లు జరగడమే వసూళ్ల రాయుళ్లకు ఆదాయాన్ని తెచ్చే మార్గంగా మారింది. ముఖ్య నాయకులను మచ్చిక చేసుకుని అధికారులకు సైతం వాటాలు ఇస్తూ దర్జాగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
Kamareddy Municipality | ఒకరు ఫిర్యాదు.. మరొకరు సెటిల్మెంట్
ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచిన అసలైన కౌన్సిలర్లను ముందు పెట్టి వెంచర్లపై, నిర్మాణాలపై ఫిర్యాదులు చేయించి ఆ తర్వాత షాడో కౌన్సిలర్లు రంగంలోకి దిగుతున్నారన్న టాక్ మున్సిపల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అధికారంలో ఉన్న కౌన్సిలర్ల పేరుతో మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయించడం, ఆ ఫిర్యాదు ఆధారంగా అధికారులు వెంచర్ వద్దకు, నిర్మాణం వద్దకు వెళ్లి నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత రాజీ పేరుతో తెరవెనుక బేరసారాలు సాగడం ఇప్పుడు పరిపాటిగా మారిందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని స్థానికంగా చెప్పుకుంటున్నారు.
Kamareddy Municipality | కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లు, వెంచర్లే టార్గెట్
ప్రధానంగా కొత్తగా చేస్తున్న వెంచర్లు, కొత్తగా నిర్మిస్తున్న ఇళ్లే టార్గెట్‌గా ఈ దందా సాగుతోంది. బల్దియా పరిధిలో ఎక్కడైనా కొత్తగా పిల్లర్లు లేస్తున్నా.. లేఅవుట్ వేస్తున్నా చాలు వెంటనే వారి దృష్టికి వెళుతుంది. లేఅవుట్లో తేడా ఉందా, పార్క్ స్థలం వదిలారా లేదా.. రోడ్డు వెడల్పు తక్కువ ఉందా.. ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఉందా లేదా, సెట్ బ్యాక్ వదిలారా అంటూ నిశితంగా పరిశీలించి వెంచర్ నిర్వాహకులను, ఇంటి యజమానులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి టార్గెట్ చేసిన తర్వాత వరుస ఫిర్యాదులతో ఉక్కిరిబిక్కిరి చేసి వసూళ్లకు తెగబడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
Kamareddy Municipality | 200 గజాల స్థలం ఆక్రమణ ప్రచారం
ఇటీవల ఓ వెంచర్లో 200 గజాల స్థలం ఆక్రమణ జరిగిందంటూ ప్రచారం చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఆక్రమణ జరిగిందని, నాలా స్థలాన్ని కబ్జా చేశారని, అనుమతులు లేకుండా అమ్మకాలు చేస్తున్నారని, పర్మిషన్‌కు మించి నిర్మాణం చేస్తున్నారని రకరకాల ఆరోపణలతో ఫిర్యాదులు చేసి, ఆ తర్వాత ఆ ఫిర్యాదులను ఉపసంహరించుకోవడానికి లక్షల్లో డిమాండ్ చేస్తున్నారని వెంచర్ నిర్వాహకులు, ఇళ్ల యజమానులు వాపోతున్నారు.
Kamareddy Municipality | షాడో కౌన్సిలర్ల తీరుతో బల్దియాకు మచ్చ
వసూళ్ల కోసం షాడో కౌన్సిలర్లు టీములుగా ఏర్పడడం బల్దియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన వారు ఇలా వసూళ్లకు పాల్పడుతుండడం బల్దియా ప్రతిష్టకు మచ్చగా మారింది. దీనివల్ల నిజాయితీగా వెంచర్లు చేసే వారు, అనుమతులతో ఇళ్లు కట్టుకునే సామాన్యులు సైతం భయపడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kamareddy Municipality | పట్టించుకోని ముఖ్య నాయకులు
ఈ వసూళ్ల దందా వెనుక ముఖ్య నాయకుల అండదండలు, అధికారుల మౌనం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు హడావుడిగా స్పందించడం, కానీ సెటిట్‌మెంట్ జరిగిన తర్వాత అదే ఫిర్యాదును పక్కన పెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం బల్దియాలో చర్చనీయాంశంగా మారినా ముఖ్య నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వసూళ్ల దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Leopard Sighting | మోపాల్ శివారులో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు