అక్షరటుడే, కామారెడ్డి: Urea Crisis | యూరియా యాప్ రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఖరీఫ్ సాగు ప్రారంభమైనా యూరియా(Urea Shortage) అందకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజంపేట (Rajampet) మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది.
Urea Crisis | రాజంపేట మండల కేంద్రంలో..
యూరియా అందుబాటులోకి వచ్చిందన్న నిమిషాల వ్యవధిలో బుక్కయిపోవడం పట్ల అన్నదాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. వానాకాలం సీజన్ మొదలు కావడంతో రైతులకు యూరియా తప్పనిసరిగా మారింది. దాంతో రైతన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ధర్నాలు, రాస్తారోకోలతో లాభం లేకపోవడంతో ఓ రైతు ఏకంగా పెట్రోల్ డబ్బా వెంట తెచ్చుకుని ఒంటిమీద పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంచలన ఘటన రాజంపేట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. సోమవారం సొసైటీ వద్ద యూరియా అందుబాటులో ఉందని రైతులంతా కార్యాలయం వద్ద క్యూకట్టారు.
Urea Crisis | రెండు నిమిషాల్లోనే..
యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించగా కేవలం రెండు నిమిషాల్లోనే యూరియా బుకింగ్ క్లోజ్ అయింది. దాంతో మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘యూరియా బుక్ చేసుకోవడం మాకు రాదు.. అలాగని ఇలా నిమిషాల్లో యూరియా అయిపోతే మాలాంటి రైతుల పరిస్థితి ఏంటి..? మాకు యూరియా వస్తుందా రాదా..?’ అంటూ పెట్రోల్ బాటిల్ తెచ్చుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పక్కనే పోలీస్ స్టేషన్ ఉండటంతో పోలీసులు వచ్చి బాటిల్ లాక్కున్నారు. అనంతరం రైతులకు నచ్చజెప్పారు. ఈ ఘటన రాజంపేటలో కలకలం రేపింది.

ఇది కూడా చదవండి: వైష్ణవిని పెళ్లాడిన షణ్ముఖ్ జశ్వంత్