అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Employees Protest | తెలంగాణలో ఉద్యోగ సంఘాలు – రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ వాతావరణం నెలకొంది.
తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ‘చలో హైదరాబాద్’ పిలుపుతో ఉద్యోగులు కదం తొక్కేందుకు సిద్ధమవుతున్న వేళ.. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తమకు రావాల్సిన హక్కుల కోసం అడిగితే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Telangana Employees Protest | ఉద్యోగుల ఘాటు ప్రశ్నలు
ఢిల్లీ, కొడంగల్లో బహిరంగ వేదికలపై ముఖ్యమంత్రి మాట్లాడిన తీరును ఉద్యోగ నేతలు తప్పుబట్టారు. జీతాలు, పీఆర్సీ(PRC), డీఏల (DA) పెంపు అనేది ప్రభుత్వం వేసే భిక్ష కాదని, అది ఉద్యోగుల “రాజ్యాంగబద్ధమైన హక్కు” (Constitutional Right) అని స్పష్టం చేశారు.
“ఇంకా నాకు రెండేళ్ల సమయం ఇవ్వండి” అని సీఎం కోరడాన్ని ప్రశ్నిస్తూ.. ఇప్పటికే మూడేళ్ల సమయం గడిచిపోయిందని, ఇంకా సమయం ఇవ్వడం అంటే సమస్యలను దాటవేయడమేనని విమర్శించారు.
Telangana Employees Protest | బెదిరించడం లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ నివేదిక ఆధారంగా జీతాలు పెంచుతామని, డీఏ బకాయిలను క్లియర్ చేస్తామని స్పష్టమైన మాటిచ్చారని, కానీ ఇప్పటివరకు ఆ ఆరు నెలల హామీలు నెరవేరలేదని వాపోయారు.
ఉద్యోగులు తనను బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తమకు ప్రభుత్వాన్ని బెదిరించే ఉద్దేశం లేదని, ఇప్పటివరకు ఎంతో గౌరవంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Assembly Sessions | రాజకీయ సమరం.. ప్రజా సమస్యలకు గ్రహణం.. అసెంబ్లీ వేదికగా మళ్లీ తిట్ల పర్వమేనా?
Telangana Employees Protest | రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై లబోదిబో
ఒక్కో ఉద్యోగి రిటైర్ అయితే కోటి నుంచి కోటిన్నర రూపాయలు ఇవ్వాల్సి వస్తోందని ప్రభుత్వం బకాయిల విడుదలలో భారాన్ని సాకుగా చూపడాన్ని నిరసించారు. గత 10 ఏళ్ల పాలనతో పోల్చితే.. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల వైపు ఉందో.. లేదో వారే తేల్చుకోవాలని విమర్శించారు.
కాగా, సెప్టెంబరు 10న జరగబోయే నిరసన కార్యక్రమం తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఒకవైపు ఆర్థిక లోటుతో ప్రభుత్వం సతమతమవుతుంటే.. మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన పీఆర్సీ, డీఏ హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు గట్టిగా పట్టుబడుతున్నారు.
ఈ ‘చలో హైదరాబాద్’ పిలుపు సఫలమై ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డెక్కితే, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.