అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bodhan Sand Mining | బోధన్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కన్నుగప్పి ఇసుక మాఫియా జోరుగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని వారు అంటున్నారు.
Bodhan Sand Mining | భారీ యంత్రాలతో..
బోధన్ పట్టణానికి సమీపంలోని పసుపు వాగులో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినట్లు సమాచారం. పొక్లెయిన్ యంత్రాలతో ఇసుకను తవ్వి, టిప్పర్ల ద్వారా తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఒక పొక్లెయిన్‌తో పాటు నాలుగు టిప్పర్లు రాత్రి సమయంలో ఇసుక రవాణాలో పాల్గొన్నట్లు వారు పేర్కొన్నారు.
Bodhan Sand Mining | పసుపు వాగులో నిరంతరాయంగా..
ఇసుక అక్రమ రవాణాపై ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు అక్రమ వ్యాపారులు వాటిని పట్టించుకోకుండా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసుపు వాగులో నిరంతరంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం కలగడంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.