Kamareddy Congress | విచారణపై ఉత్కంఠ.. రేపు క్రమశిక్షణ కమిటీ ముందుకు షబ్బీర్ అలీ..

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​లో రెండు వర్గాల మధ్య రేగిన వివాదం గాంధీభవన్​కు చేరింది. పోటాపోటీ ఫిర్యాదులతో అట్టుడికిన పరిస్థితులపై క్రమశిక్షణ కమిటీ సీరియస్​గా దృష్టి పెట్టింది.

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Congress | కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్​లో రెండు వర్గాల మధ్య రేగిన వివాదం గాంధీభవన్​కు (Gandhi Bhavan) చేరింది. పోటాపోటీ ఫిర్యాదులతో అట్టుడికిన పరిస్థితులపై క్రమశిక్షణ కమిటీ సీరియస్​గా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఒక దశ విచారణ పూర్తి కాగా, రెండో దశ విచారణకు రంగం సిద్ధమైంది.

Kamareddy Congress | పక్షం రోజులుగా..

పక్షం రోజులుగా కామారెడ్డి(Kamareddy) కాంగ్రెస్ రెండుగా చీలింది. సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali), టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో రంగంలోకి దిగిన క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని పిలిచి విచారించింది.

Kamareddy Congress | మరోసారి షబ్బీర్ అలీ..

సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదివారం గాంధీభవన్​లోని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకానున్నారు. కామారెడ్డి వివాదంపై ఆయన వాదన వినేందుకు కమిటీ సిద్ధమైంది. ఇప్పటికే ఆయన మాట్లాడినట్టుగా వైరల్ అయిన ఆడియోపై షబ్బీర్ అలీ కమిటీకి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం మరోసారి కమిటీ రావాలని కోరడం చర్చనీయాంశంగా మారింది. గత పక్షం రోజులుగా నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, ఫిర్యాదులపై ఆయన నుంచి కమిటీ సభ్యులు వివరణ తీసుకోనున్నారు. షబ్బీర్ అలీ ఏం చెబుతారన్న దానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Kamareddy Congress | సంబంధం ఉన్న నేతలు రావాలని కమిటీ ఆదేశం

కేవలం షబ్బీర్ అలీ ఒక్కరే కాదు.. ఈ అంశంతో సంబంధం ఉన్న నేతలంతా విచారణకు రావాలని కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదివారం గాంధీభవన్ కామారెడ్డి నేతలతో కిక్కిరిసిపోనుంది. అయితే కమిటీ ముందు ఎవరు హాజరవుతారు అనేదానిపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం ఫిర్యాదులలో పేర్కొన్న అందరూ కమిటీ ముందు హాజరవుతారా..? లేక షబ్బీర్ అలీ ఒక్కరే హాజరవుతారా..? అనేది సస్పెన్స్​గా మారింది.

Kamareddy Congress | ముగిసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విచారణ..

ఈ వివాదంలో మరో కీలక నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి విచారణ ఇప్పటికే ముగిసింది. ఈనెల 11న కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన వివరణ ఇచ్చారు. అలాగే గత శుక్రవారం మరోసారి ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్​పర్సన్ గడ్డం ఇందుప్రియతో కలిసి కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. కమిటీ ముందు హాజరైన ఆయన తన వర్షన్​ను వినిపించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. రెండు గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. షబ్బీర్ అలీ విచారణతో కామారెడ్డి వ్యవహారంపై కమిటీ ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ తన నివేదికను పీసీసీ చీఫ్​కు, అధిష్టానానికి సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగానే అధిష్టానం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుస్తుందా, లేక ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారా అన్న దానిపై జిల్లా కాంగ్రెస్​లో ఉత్కంఠ కొనసాగుతోంది. విచారణతో వివాదం సద్దుమణుగుతుందా లేక మరింత ముదురుతుందా అన్నది వేచి చూడాలి.

kamareddy 1

ఇది కూడా చదవండి : వరంగల్ జిల్లాలో ఉద్రిక్తత..! 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *