అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Profits Telangana | నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాటలోకి తీసుకు వచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్కు ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు.
నాగర్కర్నూల్ నుంచి వనపర్తి వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను మంత్రి పొన్నం ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.
RTC Profits Telangana | కార్మికుల సమస్యలు పరిష్కరించాం
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు (RTC Workers) 55 రోజులపాటు సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి, పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన దురదృష్టకర పరిస్థితులను రాష్ట్రం చూసిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రివర్గ ఉపసంఘం కేవలం మూడు రోజుల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు.
RTC Profits Telangana | డీఏలు విడుదల చేశాం
తాము అధికారంలోకి వచ్చాక ఆర్టీసీని ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీని అమలు చేయడంతో పాటు బాండ్లు, డీఏలు విడుదల చేశామని వెల్లడించారు. కారుణ్య నియామకాలు చేపట్టి కొత్త ఉద్యోగాల భర్తీ ప్రారంభించామని చెప్పారు. కొత్త బస్సుల కొనుగోలు కూడా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా 375 రూట్లలో బస్సులు నడుపుతూ ప్రతిరోజూ అదనంగా 7 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
RTC Profits Telangana | అభివృద్ధే లక్ష్యంగా..
మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ప్రజల ఆకాంక్షల కోసం రాజీనామా చేసి పోరాటం చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
దీనిని కూడా చదవండి : MeeSeva Urea Booking | మీ సేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభం