అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Urea Supply | రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) స్పష్టం చేశారు. తెలంగాణకు సరిపడా ఎరువులు అందించకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. గాంధీ భవన్లో జరిగిన ‘మంత్రితో ముఖాముఖీ’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
Telangana Urea Supply | కేంద్రంపై మంత్రి ఆగ్రహం..
ఎరువుల సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందులో బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి ఆరోపించారు. ఎరువుల కోసం కేంద్ర మంత్రులను కలవడానికి కూడా సిద్ధమని, అయినా సరఫరా చేయకపోతే కేంద్రంతో పోరాడుతామని చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో తయారయ్యే ఉత్పత్తిలో పూర్తి వాటా తెలంగాణకే దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమకు అధికారం లేదని, మిత్రపక్షం కాదనే కారణంతోనే కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. విపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోందని రైతులకు సూచించారు.

Telangana Urea Supply | సంక్షేమ పథకాలపై వివరణ..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కూడా మంత్రి స్పష్టతనిచ్చారు. తాజాగా మరో 2 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని, అర్హులైన వారందరికీ వీటిని త్వరలోనే అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ కార్డులు జారీ చేశామని, నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్లో కొత్తగా లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.
Telangana Urea Supply | ఇబ్బందులు లేకుండా..
ఈ నెల 29న ‘ఏరువాక పౌర్ణమి’ నుంచి వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని, ఎరువులు, విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ , మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: HYDRAA Land Protection | రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా