అక్షరటుడే, వెబ్డెస్క్: Liquor Free Village | సమాజంలో మార్పు కోసం ఎవరూ ఎదురుచూడనక్కర్లేదు.. మనమే మొదలుపెట్టాలి. ఇదే నినాదంతో జనగామ జిల్లా (Jangaon District) నష్కల్ గ్రామం ఒక సాహసోపేతమైన అడుగు వేసింది. యువత భవిష్యత్తును కాపాడుకునేందుకు, తమ గ్రామాన్ని ‘సంపూర్ణ మద్యపాన రహిత’ క్షేత్రంగా మార్చుకునేందుకు గ్రామ పంచాయతీ కఠినమైన నిర్ణయాలను అమలు చేస్తోంది.
Liquor Free Village | గ్రామసభ ఏకగ్రీవ నిర్ణయం..
గ్రామంలో రహస్యంగా బెల్ట్ షాపులు నడుపుతూ యువతను మత్తులోకి దించుతున్న ఆరుగురు వ్యక్తులను గ్రామ పెద్దలు గుర్తించారు. గ్రామసభలో తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం మేరకు, సర్పంచ్ శాతబోయిన రాజు ఆధ్వర్యంలో అధికారులు వెంటనే స్పందించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆ ఆరుగురి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను నిలిపివేసి, గ్రామస్థులందరికీ గట్టి సంకేతం పంపారు.
Liquor Free Village | సంక్షేమ పథకాలూ బంద్..
కేవలం కరెంటు కట్ చేయడమే కాదు, అంతకంటే కఠినమైన నిబంధనలను సర్పంచ్ తెరపైకి తెచ్చారు. ఇకపై గ్రామంలో మద్యం విక్రయించినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా.. వారికి అందే రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. “ఇకపై గ్రామంలో చుక్క మద్యం అమ్మేది లేదు” అని అక్రమ నిర్వాహకులు రాతపూర్వక హామీ ఇస్తేనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని సర్పంచ్ తెగేసి చెప్పారు.
Liquor Free Village | సామాజిక బహిష్కరణ తప్పదని..
మద్యం దెబ్బకు గ్రామంలోని యువత పెడదోవ పడుతున్నారని, తమ ఊరి ఆధ్యాత్మిక విలువలు దెబ్బతింటున్నాయని మహిళలు, గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరైనా మళ్లీ బెల్ట్ షాపుల జోలికి వెళ్తే.. వారికి సామాజిక బహిష్కరణ తప్పదని గ్రామస్థులు ఏకగ్రీవంగా హెచ్చరించారు.
Liquor Free Village | ఆదర్శంగా నష్కల్..
రాష్ట్రంలోనే మొదటి ‘మద్యపాన రహిత గ్రామంగా’ నిలవాలన్న నష్కల్ ప్రజల సంకల్పం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వచ్ఛందంగా గ్రామస్థులు, మహిళలు కలిసి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం.
ఇది కూడా చదవండి..: Chain Snatching | జిల్లాలో ‘గొలుసు’ చోరీలు.. యథేచ్ఛగా తిరుగుతున్న స్నాచింగ్ ముఠాలు