అక్షరటుడే, వెబ్‌డెస్క్: RTC Driver | రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. భూపాలపల్లి ఆర్టీసీ డిపో (Bhupalapally RTC Depot)కు చెందిన రవీందర్ పురుగుల మందు తాగాడు.
తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు కార్మికులు మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. రవీందర్ శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి (Warangal MGM Hospital)కి తరలించారు. ఇప్పటి వరకు నలుగురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అందులో శంకర్‌గౌడ్ అనే డ్రైవర్ మృతి చెందాడు.
RTC Driver | సీఎం దిగ్భ్రాంతి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధి ఉన్నామని చెప్పారు. కాగా నేడు ఆర్టీసీ జేఏసీ నాయకులతో మంత్రులు చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం జేఏసీ అత్యవసర భేటీ అయ్యారు.
RTC Driver | రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు
ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతుందన్నారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపాలని సూచించారు. ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడంలో అభ్యంతరం లేదన్నారు. ..కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతలు సంయమనం పాటించాలని కోరారు.
ఇది కూడా చదవండి..: Cooperative Societies | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకమండళ్లు

