అక్షరటుడే వెబ్డెస్క్: Mulugu Development Works | త్వరలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారని, ఆయన చేతుల మీదుగా పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నామని రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ ( Seethakka ) వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్కేడ్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ వికాస్ మీనా, ఐటీడీఏ పీవో నవీన్ వత్సల్ టొప్పోలతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
Mulugu Development Works | అధికారులకు దిశానిర్దేశం..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను అధికారుల ముందు ఉంచారు. మేడారం అభివృద్ధి పనులు, ఇతర పెండింగ్లో ఉన్న పనులను రాబోయే పది రోజుల్లోనే పూర్తి చేయాలని మంత్రి గడువు విధించారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించామని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలోని చెరువులకు గోదావరి జలాలను అందించేందుకు చేపట్టిన పైప్లైన్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
Mulugu Development Works | ప్రజలను అప్రమత్తం చేస్తూ..
ప్రస్తుత వ్యవసాయ సాగు సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు సూచించారు. జిల్లాలో చేపట్టిన భూముల సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా, వర్షాకాలంలో గ్రామీణ ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వర్షాకాలంలో అనుకున్న లక్ష్యాలను మించి మొక్కలు నాటాలని, అటవీ శాఖ ద్వారా ప్రజలకు విరివిగా మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు.
Mulugu Development Works | సమన్వయంతో పని చేయాలని..
అభివృద్ధి విషయంలో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో ఉంచేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్ఓ రవికుమార్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: TSLPRB Notification | త్వరలో పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్