అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Comments | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని గంగారాం నగర్లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వంటావార్పు’ నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Harish Rao Comments | వెయ్యి పడగల మయం..
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో పరిపాలన ‘వెయ్యి పడగల మయం’లా మారిందని హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా భూదందాలు, సెటిల్మెంట్లు, కబ్జాలే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం కమిషన్ల చుట్టే ప్రభుత్వ పాలన తిరుగుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నీ ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయని ఆరోపించారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, చేప పిల్లల పంపిణీ, దళిత బంధు, బీసీ బంధు వంటి పథకాలన్నీ నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Comments | కొత్త పింఛన్లు లేవు..
బీఆర్ఎస్ హయాంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2,000 చేశామని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదని హరీష్ రావు విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) మాటలు నీటి మూటలయ్యాయని, కనీసం ఒక్క గ్యారెంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని దుయ్యబట్టారు.
పేదల వివాహాల కోసం కేసీఆర్ హయాంలో ‘కల్యాణ లక్ష్మి’ కింద రూ. లక్ష చొప్పున 2.60 లక్షల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం అందిస్తే.. కాంగ్రెస్ పాలనలో కేవలం 86 వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎత్తిచూపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతోందని, రానున్నది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, నాయకులు విజిత్ రావుతో పాటు స్థానిక పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Sri Krishna Janmashtami | వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు