Tirupati Murders | తిరుపతిలో దారుణం.. పెళ్లి వేడుకలో జంట హత్యలు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tirupati Murders | ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ( Tirupati ) జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన వివాహ వేడుకలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. మృతులను మునిరత్నం (50), మణికంఠ (42)గా పోలీసులు గుర్తించారు.

Tirupati Murders | ఏం జరిగిందంటే..

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్, తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే, కొద్ది కాలం క్రితం సునీల్ ఎలాంటి కారణం చెప్పకుండానే తన భార్యను వదిలేశాడు. ఈ క్రమంలో, పద్మావతి కల్యాణ మండపంలో జరుగుతున్న మరో పెళ్లికి సునీల్ వస్తున్నాడని తెలుసుకున్న సంపూర్ణమ్మ.. ఈ విషయాన్ని తన కుమార్తె వివాహ సమయంలో పెద్దలుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలకు తెలియజేసింది.

Tirupati Murders | కత్తులతో దాడి..

దీంతో మునిరత్నం, మణికంఠలు కల్యాణ మండపానికి చేరుకుని, భార్యను ఎందుకు వదిలేశావని సునీల్‌ను నిలదీశారు. దీనిపై ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ కాస్తా ఘర్షణకు దారితీయడంతో, అక్కడే ఉన్న సునీల్ తమ్ముడు, అక్క , మరో బంధువు కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.

Tirupati Murders | నిందితుల కోసం గాలింపు..

ఈ దాడిలో మునిరత్నం అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మణికంఠను చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఈ ఘటనతో వేడుకలో ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దాడి తర్వాత సునీల్ , అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Urea Slot Booking | మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్ : కలెక్టర్ ఇలా త్రిపాఠి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *