KTR Comments Revanth | నీళ్లు అడిగితే నెత్తురు చల్లుతా అంటావా.. సీఎంపై కేటీఆర్​ ఆగ్రహం

సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటావా అంటూ మండిపడ్డారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Comments Revanth | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నాయకులు మండి పడుతున్నారు. నీళ్లు అడిగితే రక్తం చల్లుతా అంటావా అంటూ బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం రేవంత్​రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కరువు వచ్చిందని, నీళ్లు ఎలా అని ఓ జర్నలిస్ట్​ ప్రశ్నించారు. దీంతో వారిని కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని బీఆర్​ఎస్​ నాయకులను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్​ స్పందించారు. ఇంకా రక్తదాహం తీరలేదా అని ప్రశ్నించారు. 60 ఏండ్లు పీడించి తెలంగాణ నెత్తురు తాగారు సరిపోలేదా అన్నారు.

KTR Comments Revanth | ఇంకెంత రక్తం కావాలి

తెలంగాణ రక్తం రుచిమరిగిన కాంగ్రెస్ పార్టీకి ఇంకెంత రక్తం కావాలి అని కేటీఆర్​ ప్రశ్నించారు. తెలంగాణ పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి ఎన్​కౌంటర్ల పేరుతో నెత్తుటేళ్లు పారించిన నరహంతకులు కాంగ్రెస్​ నాయకులని ఆరోపించారు. 1952లో ఏడుగురు యువకులను కాల్చిచంపారని, 1969లో 369 మంది ముద్దుబిడ్డలపై తూటాలు కురిపించి రక్తం పారించారని గుర్తు చేశారు. మలిదశ పోరాటంలో వేయిమందిని బలితీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేతులు తెలంగాణ బిడ్డల రక్తంతో తడిచాయన్నారు.

KTR Comments Revanth | నీళ్లు ఇవ్వు

‘నీకు మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం..కానీ, నువ్వు రైతులకు నీళ్లు ఇవ్వు’ అని కేటీఆర్​ సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నెత్తురు ఇస్తేనే.. నీళ్లు ఇస్తాం అని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుతుంటే తమ రక్తం ధారపోస్తామని పేర్కొన్నారు. ఎండుతున్న పొలాల జలదాహం తీర్చాలని కోరారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నాయకులు నిరసన తెలుపుతున్నారు. రేవంత్​రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు.

దీనిని కూడా చదవండి : Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్​ దాడి.. భారతీయుడి గల్లంతు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *