అక్షరటుడే, ఆర్మూర్: Prashanth Reddy | గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని.. జైల్లో పెట్టిన పోరాటం ఆగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి కోసం శాంతియుత దీక్ష కోసం ఆయన బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.
Prashanth Reddy | రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్య..
భీమ్‌గల్ (Bheemgal)లో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు తక్షణమే పూర్తి చేయాలనే సంకల్పంతో తాను తలపెట్టిన శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను పోలీసులు అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్య అని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు.
Prashanth Reddy | వంద పడకల ఆస్పత్రి నిర్మాణం పూర్తయ్యేదెన్నడు..?
గత ప్రభుత్వ హయాంలో మంజూరై.. దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీమ్‌గల్ 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే భీమ్‌గల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీమ్‌గల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ.12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే 15వ తేదీన చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు ‘కఠోర నిరాహార దీక్ష’కు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Prashanth Reddy | ప్రజలకు ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తే తప్పా..?

ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా నిరాహార దీక్ష చేస్తానంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఆయన ప్రశ్నించారు. తాను ఉదయం నిద్రలేవక ముందే, కనీసం స్నానం కూడా చేయకముందే వందలాది మంది పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, భీమ్‌గల్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొలగించి, ఫ్లెక్సీలను సైతం చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనమన్నారు.
Prashanth Reddy | ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే..
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారికంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది చేతకాక, పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చిచెప్పారు. ప్రజా ప్రతినిధిగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను ఇంట్లో నిర్బంధించినా, పోలీస్ స్టేషన్‌కు తరలించినా, లేదా జైల్లో పెట్టినా తన సత్యాగ్రహం, కఠోర నిరాహార దీక్ష ఎక్కడ ఉంటే అక్కడే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భీమ్‌గల్ పట్టణ, మండల ప్రజలు, యువత, కుల సంఘాలు, వీడీసీ (VDC) సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయమైన పోరాటానికి, నిరాహార దీక్షకు మద్దతు తెలపాలని వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Dr L Ramulu | నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు