Telangana Reservoirs | అడుగంటిన ప్రాజెక్ట్​లు.. ఆందోళనలో రైతన్నలు..

వానాకాలం సీజన్ మొదలైనా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో సాగు పనులు ప్రశ్నార్థకంగా మారాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Reservoirs | వానాకాలం సీజన్ మొదలైనా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడంతో సాగు పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా రైతులు వర్షాలు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

Telangana Reservoirs | ఉమ్మడిజిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల నీటిమట్టాలు అడుగంటి డెడ్​ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. దీంతో వానాకాలం పంటల సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉండడంతో అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావం ఉండడంతో వర్షాలు ముఖం చాటేశాయి. వర్షాకాలం ప్రారంభమై యాభై రోజులకు పైగా గడుస్తున్నా వరుణుడి కరుణ రైతులపై లేకుండా పోయింది. ఎగువ నుంచి సైతం ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి.

Telangana Reservoirs | ఎండిపోతున్న నార్లు.. అన్నదాతల్లో ఆవేదన..

రెండుమూడురోజుల నుంచి అడపాదడపా వాన చినుకులు కురవడం తప్ప ఈ సీజన్​లో మోస్తరు వర్షం కూడా కురవలేదు. ఇప్పటికే పొలల్లో వేసిన నార్లు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. బోర్లకింద సాగవుతున్న పంటలు కాకుండా వర్షాలమీదే ఆధారపడ్డ రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆకాశంవైపు చూస్తూ.. వరుణ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Telangana Reservoirs | నిజాంసాగర్‌లో 6 టీఎంసీలకే పరిమితం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కు ప్రధాన ఆధారమైన నిజాంసాగర్ ప్రాజెక్టుకు 17.802 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం కేవలం 6 టీఎంసీల నీరే ఉంది. జూలై నెల వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 278.5 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే చాలా తక్కువ. మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, బాన్సువాడ, పిట్లం ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 17,802 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. గోదావరి జలాలు వస్తాయా లేదా అనే అనుమానంతో రైతులు ఉన్నారు. సింగూర్, కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు వెంటనే నీటిని తరలించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Telangana Reservoirs | పోచారం ప్రాజెక్ట్​ డెడ్ స్టోరేజీకి..

కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఒకప్పుడు పూర్తి స్థాయిలో ఉన్న ప్రాజెక్టు ఇప్పుడు డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వలు అడుగంటాయి. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల్లోని 16 వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుంది. పోచారం నుంచి అన్నాసాగర్ వరకు కాల్వల ద్వారా పంటలకు నీరందించేవారు. కానీ ఇప్పుడు నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

Telangana Reservoirs | బోరుబావులపైనే ఆధారం..

ప్రాజెక్టుల నుంచి నీరు రాకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడాల్సి వస్తుంది. వరుణుడు కరుణిస్తాడనే ఆశతో కొందరు రైతులు అప్పులు చేసి నారుమడులు, విత్తనాలు కొనుగోలు చేశారు. వర్షాలు లేకపోతే చేసిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆరుతడి పంటలు సూచించినా, ఇప్పటికే వరి నారు సిద్ధం చేసుకున్న రైతులు ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతున్నారు.Telangana Reservoirs

Telangana Reservoirs | ఇప్పుడిప్పుడే శ్రీరాంసాగర్​లోకి..

అక్షరటుడే, ఆర్మూర్​: తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద వస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, 80.5 టీఎంసీల నీటిమట్టం కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 1,064.50 అడుగులు, 15.400 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే రోజు నీటిమట్టం 1068.60 అడుగులు, నిల్వ 21.029 టీఎంసీలుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 6 టీఎంసీల నీటిమట్టం తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,199 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతుండగా ఆవిరి, మిషన్ భగీరథ కాలువల ద్వారా 751 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.

ఇది కూడా చదవండి..: Toddy Workers | కల్లుగీత కార్మికుల హక్కుల కోసం చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *