అక్షరటుడే వెబ్‌డెస్క్: NEET Paper Leak | పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై రాజకీయంగా దుమారం చెలరేగింది. విపక్షాలు పార్లమెంట్ పరిసరాల్లో గళమెత్తడంతో వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిపై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ( Renuka Chowdhury ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆమె కేంద్రంపై విరుచుకుపడ్డారు.
NEET Paper Leak | విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి..
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పోరాటం చేస్తోందని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యత వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ నుంచి సదరు మంత్రిని పంపించేయాలని దేశమంతా కోరుతున్నా.. ఈ చెవిటి, గుడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NEET Paper Leak | ప్రభుత్వ తీరుపై సెటైర్లు..
అసలు ఈ ప్రభుత్వానికి పార్లమెంట్‌ను ఎలా నడపాలో కూడా తెలియదని రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. విపక్షాలు లోపలికి రాకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రతి అరగంటకు ఒకసారి సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. “ఇది ప్రజాస్వామ్యం, దీన్ని మీరు ఆపలేరు. మీరు ఎంతైనా వందేమాతరం పాడుకోండి, కావాలంటే దానికి మరో పది చరణాలు కలపండి.. ఏదీ మారదు. మీ కాలం ముగిసింది, ఇక పర్యవసానాలు అనుభవించడానికి సిద్ధంగా ఉండండి” అంటూ ఆమె ఘాటు హెచ్చరికలు జారీ చేశారు.
NEET Paper Leak | లాఠీచార్జ్‌ను ఖండించిన ఎంపీ..
నీట్ పేపర్ లీక్‌పై ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు పోలీసుల దెబ్బలకు విలవిలలాడారని వాపోయారు. ప్రభుత్వం ఈ విషయంలో పోలీసులను కూడా లాగి బలిపశువులను చేస్తోందని, ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు సైతం బాధితులేనని రేణుకా చౌదరి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Karate Guinness Record | గిన్నిస్ రికార్డు సాధించిన కరాటే క్రీడాకారులను అభినందించిన పీసీసీ చీఫ్..