Assembly Age Limit | పోటీ వయస్సు 21 ఏళ్లకు తగ్గింపు .. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామన్న సీఎం రేవంత్

శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Assembly Age Limit | శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించే అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన ఆయన.. 21 ఏళ్లకే యువత సివిల్ సర్వెంట్లుగా, మేయర్లుగా, స్థానిక సంస్థల ప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎందుకు అర్హులు కాకూడదని ప్రశ్నించారు. గతంలో ఓటు హక్కు వయస్సు 21 ఏళ్లుగా ఉన్నప్పుడు పోటీ చేసే వయస్సు 25 ఏళ్లుగా ఉండేదని, ప్రస్తుతం ఓటు వయస్సు 18 ఏళ్లకు తగ్గినందున పోటీ చేసే వయస్సును కూడా 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు.

Assembly Age Limit | ఆగస్టులో అసెంబ్లీలో తీర్మానం..

వచ్చే ఆగస్టులో తెలంగాణ శాసనసభలో దీనిపై అధికారికంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సీఎం తెలిపారు. దీని ద్వారా ఈ అంశం పార్లమెంట్‌లో చర్చకు వస్తుందన్నారు. తొలుత అసెంబ్లీలో తీర్మానం ఆమోదించిన తర్వాత, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి ఈ ప్రతిపాదనను వారి ముందుంచుతామన్నారు. ఆ తర్వాత ‘ఇండియా’ కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.

Assembly Age Limit | మోడీ విధానాలపై విమర్శలు..

విపక్షాలు లేవనెత్తే అంశాలను బెదిరింపులు, ఈడీ, సీబీఐ కేసులతో తొక్కిపెట్టడం ప్రధాని మోడీకి అలవాటుగా మారిందని రేవంత్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రలలో పార్టీలను చీల్చి ప్రతిపక్షాలను బలహీనపరచాలని చూశారని మండిపడ్డారు. అయితే ఈసారి దేశ యువత రోడ్లపైకి వచ్చి పార్లమెంట్ వరకు పోరాడి మోడీని ఎదుర్కొన్నారని, రైతులు, యువత పోరాటం ముందు ఏ ప్రభుత్వమైనా తలవంచాల్సిందేనని అన్నారు.

Assembly Age Limit | రఘునందన్ రావు కౌంటర్..

యువతకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు వయోపరిమితిని తగ్గిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ‘జెన్ జీ’ యువతపై అంత ప్రేమ ఉంటే, ముందుగా తన పార్టీలో ఒక యువ ఎమ్మెల్యేకు విద్యాశాఖను కేటాయించాలని సవాల్ విసిరారు. చేతనైతే జీహెచ్ఎంసీకి ‘జెన్ జీ’ మేయర్‌ను చేయాలని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించిన ఈ వయోపరిమితిపై ఎక్కడైనా చర్చించాల్సి వస్తే పార్లమెంటే సరైన వేదికని రఘునందన్ రావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  Navadurga Devi Bonalu | నవదుర్గాదేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *