అక్షరటుడే, వెబ్డెస్క్: AV Ranganath HYDRAA | హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తన రెండేళ్ల పదవీకాలంలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను పరిరక్షించడం తమ ప్రధాన బాధ్యతగా భావించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్లలో భారీ స్థాయిలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
Water Wastage Fine | రోడ్డుపైకి సంపు నీరు విడుదల.. రూ.15 వేల జరిమానా
మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లుగా అంచనా వేసే ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను పరిరక్షించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
AV Ranganath HYDRAA | కోర్టులను తప్పుదోవ పట్టించే యత్నం..
ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలో ల్యాండ్ మాఫియా, భూ ఆక్రమణదారులు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
లోతుకుంట ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ భూముల అంశంలో అనుమతులు లేకుండా నిర్మాణ కార్యకలాపాలు, రాతిగుట్టల ధ్వంసం, చెట్ల నరికివేతపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా జోక్యం చేసుకుందని చెప్పారు. పర్యావరణ సంస్థలు, స్థానికుల ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టామని తెలిపారు.
AV Ranganath HYDRAA | వారంతా సర్కారు భూముల ఆక్రమదారులే
తనపై ప్రస్తుతం 63 కోర్టు ధిక్కార (కాంటెంప్ట్) కేసులు ఉన్నాయని, ఇవన్నీ భూ ఆక్రమణలపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో నమోదైనవేనని ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన పలువురు ప్రభావశీలులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఈ కేసులు దాఖలు చేశాయని ఆరోపించారు.
న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఏ బాధ్యతలు అప్పగించినా నిబద్ధతతో పనిచేశానని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వం అప్పగించే ప్రతి బాధ్యతను అదే అంకితభావంతో నిర్వర్తిస్తానని ఏవీ రంగనాథ్ తెలిపారు.