అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Rice Scam | ప్రభుత్వం పేద ప్రజల కడుపు నింపడానికి, రైతులకు మద్దతు ఇవ్వడానికి ధాన్యాన్ని కొనుగోలు చేస్తే… కొందరు ‘బడా’ బాబులకు మాత్రం అది అప్పనంగా దొరికిన మేతలా కనిపిస్తోంది.
“అధికారం మనదే, రాజకీయ పలుకుబడి మన జేబులోనే ఉంది… మనల్ని ఎవరాపేది?” అనే ధీమాతో రూ.66 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని గట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించిన వైనం నిజామాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కాలూరు గ్రామంలోని ‘శ్రీ సిద్ధి రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత కాపర్తి శ్రవణ్ లీలలు ఇప్పుడు రచ్చకెక్కాయి.
Nizamabad Rice Scam | 2 లక్షల క్వింటాళ్లు..గాల్లో కలిసిపోయాయా?
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ (TGSCSCL) పర్యవేక్షణలో ఉండాల్సిన ధాన్యం, మిల్లులోకి వెళ్లాక మాయమైపోయింది. రబీ 2022-23 నుంచి నిన్నమొన్నటి రబీ 2025-26 సీజన్ల వరకు… ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2,03,688 క్వింటాళ్ల (సుమారు 20,368 మెట్రిక్ టన్నులు) ధాన్యం మిల్లు గోడౌన్ల నుంచి ‘గాయబ్’ అయింది.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జులై 22న జరిపిన తనిఖీల్లో లెక్కలు తేలక అధికారులు దిగ్భ్రాంతి చెందారు. ప్రజాధనం సుమారు రూ. 66.12 కోట్లు స్వాహా అయినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ ధాన్యానికి మిల్లు యజమాని కేవలం ఒక ‘సంరక్షకుడు’ (Custodian) మాత్రమే. కానీ, “కాపలా కాయాల్సిన కంచే చేను మేసిన చందంగా” శ్రవణ్ వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Nizamabad Rice Scam | రాజకీయ ‘పలుకుబడి’తో ఇష్టారాజ్యం
ఈ అక్రమ దందా ఒక్క రోజులో జరిగింది కాదు. రెండు-మూడేళ్లుగా ధాన్యం మాయమవుతున్నా అధికారులు ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు సమాధానం ఒక్కటే—”రాజకీయ పలుకుబడి!”.
కాపర్తి శ్రవణ్ కుటుంబానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలలోనూ, అధికారిక వర్గాల్లోనూ గట్టి ‘నెట్వర్క్’ ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ నాయకుల దగ్గర వాలిపోవడం, తమ అక్రమాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ‘రాజకీయ నీడ’ ఉంటే ప్రభుత్వ సొత్తును ఎంతైనా నమలవచ్చనే ధీమాతోనే ఈ స్థాయి కుంభకోణానికి ఒడిగట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.
“పార్టీ ఏదైనా, జెండా ఏదైనా… మా మిల్లులో ధాన్యం మాయం కావాల్సిందే!” అన్నట్లుగా సాగింది వీరి ‘వ్యాపార’ వ్యూహం.
Nizamabad Rice Scam | రికవరీ అయ్యేనా?
ఎట్టకేలకు విజిలెన్స్ విచారణతో నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెం. 298/2026 నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 316(2), 316(5), 318(4) లతో పాటు అత్యావశ్యక వస్తువుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 7 కింద కేసులు పెట్టారు.
అయితే, సగటు పౌరులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అవి ఏమిటంటే.. కేవలం కేసులు పెట్టడానికే ఈ హడావుడి పరిమితమవుతుందా? రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసు కూడా కాలగర్భంలో కలిసిపోతుందా? రూ.66 కోట్ల ప్రజాధనాన్ని వడ్డీ, పెనాల్టీలతో సహా రాబడతారా..? లేదా “పలుకుబడి” ముందు చట్టం మోకరిల్లుతుందా?.. అని.
ప్రజాధనాన్ని మేసిన ఐరావతాలను చట్టం ఏ రకంగా బోనులో నిలబెడుతుందో, బడా బాబుల రాజకీయ రక్షణ కవచాలను ఎంతవరకు ఛేదిస్తుందో వేచి చూడాలి మరి!