అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Degree College | విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Yellareddy)లో వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) (NSS) సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
Yellareddy Degree College | విద్యార్థు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ..
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ శిబిరంలో ఏఎన్‌ఎంలు పూల, శ్రీలత పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు హెమోగ్లోబిన్, రక్తపోటు (బీపీ), రక్తంలో చక్కెర (షుగర్) పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు, ఆరోగ్య సంబంధిత మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, క్రమబద్ధమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. అలాగే ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థినీ విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని అవసరమైన మందులు స్వీకరించారు. వైద్య నిపుణులతో తమ ఆరోగ్య సమస్యలపై చర్చించి తగిన సూచనలు పొందారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు చంద్రకాంత్, రాణి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.