అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Remarks | లోక్సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అక్రమాల నిరోధక బిల్లుపై బుధవారం ( జులై 29 ) సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. విద్యార్థుల ఆందోళనలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికార బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Rahul Gandhi Remarks | రాహుల్ ప్రసంగంలోని అంశాలు..
విద్యార్థుల ఆవేదన: పేపర్ లీక్ ఘటనలతో ఎన్నో ఆశలున్న యువత తీవ్ర ఆందోళనకు గురైందని, దిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తించారని రాహుల్ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను తాను కలిశానని, ప్రభుత్వంలో ఉన్నవారు తమ ఆవేదన పట్టించుకోవడం లేదని వారు వాపోయారని పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్పై విమర్శలు: దేశంలో విద్యావ్యవస్థ క్రూరంగా మారిందని, ప్రైవేటీకరణ విచ్చలవిడిగా జరుగుతోందని రాహుల్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేవలం సింబల్ మాత్రమేనని, అసలైన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందని ఆరోపించారు. వర్సిటీల్లోనూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారినే వీసీలుగా నియమిస్తున్నారని విమర్శించారు.
Rahul Gandhi Remarks | అమిత్ షాపై ఆరోపణలు..
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ప్రశ్నించిన ఆయన.. ఆందోళనకారులను అణచివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ( Amit Shah ) ఆదేశించారని ఆరోపించారు. సభకు వచ్చే ధైర్యం హోంమంత్రికి లేదంటూ విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi Remarks | క్షమాపణలకు డిమాండ్..
రాహుల్ ప్రసంగం సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలపై భాజపా ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పేరు చెప్పి సభను, ఎంపీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ.. అమిత్ షా పేరును ప్రస్తావించడానికి రాహుల్ వద్ద ఎలాంటి ఆధారాలున్నాయని నిలదీశారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హోంమంత్రికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై సభలో వాడీవేడి వాగ్వాదం జరగగా, వివాదాస్పదమైన కొన్ని వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.
ఇది కూడా చదవండి: Fee Reimbursement | ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం