Manjeera River Flow | జలకళను సంతరించుకున్న మంజీర.. పూజలు చేసిన ఎమ్మెల్యే పోచారం

కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మంజీర నది జలకళను సంతరించుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Manjeera River Flow | వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మోస్తరు నుంచి భారీ వర్షాలు రైతులకు ఊరటను కల్పిస్తున్నాయి. జిల్లాలో(Kamareddy) విస్తారంగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండిపోయి ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. మంజీర, గోదావరి(Godavari) నదుల్లోకి వరద నీరు భారీగా చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.

Manjeera River Flow | బీర్కూర్​ మండల పరిధిలో..

బీర్కూర్(Birkur) మండల పరిధిలో ప్రవహిస్తున్న మంజీర నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఇటీవల నిర్మించిన చెక్‌డ్యామ్ కారణంగా సుమారు రెండు కిలోమీటర్ల మేర నదిలో నీరు నిల్వ ఉండి ఆ ప్రాంతం అందమైన జలాశయాన్ని తలపిస్తోంది. నాలుగు మీటర్ల ఎత్తుతో నిర్మించిన చెక్‌డ్యామ్‌పై నుంచి వరద నీరు ఉధృతంగా పొంగిపొర్లుతూ కనువిందు చేస్తోంది. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇటీవలి వర్షాలతో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు సాగునీటి వనరులు కూడా సమృద్ధిగా లభిస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరి, సోయాబీన్, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. వరద ప్రవాహం అధికంగా ఉన్న నేపథ్యంలో చెక్‌డ్యామ్‌పైకి వెళ్లి సెల్ఫీలు దిగడం, నీటిలోకి దిగడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని అధికారులు సూచిస్తున్నారు.

manjeera1

Manjeera River Flow | ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ వద్ద మంజీర నది ప్రవాహాన్ని గురువారం ఉదయం పరిశీలించారు. అనంతరం గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. నదిలో సమృద్ధిగా నీరు ప్రవహిస్తుండటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తాను శాసనసభాపతిగా ఉన్న సమయంలో బీర్కూర్ వద్ద సుమారు 1500 మీటర్ల పొడవుతో చెక్‌డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పోచారం అన్నారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. దీని ద్వారా పరిసర గ్రామాల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి, బోర్లకు నీరు అందడంతో రైతులకు దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు శశికాంత్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు పాల్గొన్నారు.

 

Manjeera River Flow |

 

ఇది కూడా చదవండి: ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *