అక్షరటుడే, బాన్సువాడ: Banswada Stray Dogs | పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు రోడ్లపై సంచరించేందుకు భయపడే పరిస్థితి నెలకొంది.
Banswada Stray Dogs | ఇటీవల 12మందికి గాయాలు..
ఇటీవల పట్టణంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడి చేయడంతో సుమారు 12 మంది గాయపడిన సంఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో సమస్యను అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్న బాన్సువాడ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఛైర్పర్సన్ కాసుల విజయ బాలరాజ్ (Kasula Vijaya Balaraj) ఆదేశాల మేరకు, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పర్యవేక్షణలో శనివారం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Banswada Stray Dogs | బోన్లు, వలలు..
బోనులు, వలలు, అవసరమైన పరికరాలతో కూడిన సిబ్బంది పట్టణంలోని వివిధ కాలనీలు, ప్రధాన రహదారులు, విద్యాసంస్థల పరిసరాలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించారు. అనంతరం వాటిని పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టుబడిన కుక్కలను భద్రంగా తరలించి అటవీ ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగించి పట్టణంలోని అన్ని వార్డుల్లో వీధికుక్కల సమస్యను పూర్తిగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఎక్కడైనా కుక్కల గుంపులు సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయానికి సమాచారం అందించాలని సూచించారు. వీధి కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ చర్యలను స్వాగతిస్తూ, పట్టణమంతటా ఇదే తరహా చర్యలు నిరంతరం కొనసాగించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: MLA Dhanpal Visits | లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్పాల్