అక్షరటుడే,కామారెడ్డి: Shabbir Ali Kamareddy | కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు అవకాశాలు తప్పకుండా వస్తాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali ) అన్నారు. కామారెడ్డి(Kamareddy), భిక్కనూర్(Bhikkanoor) మండలం తిప్పపూర్ పీఏసీఎస్ నూతన ఛైర్మన్, డైరెక్టర్ల అభినందన సభలో ఆయన మాట్లాడారు.
Shabbir Ali Kamareddy | కష్టకాలంలో జెండా మోసిన వారికి..
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని కాంగ్రెస్ ఎప్పటికీ విస్మరించదని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పిన షబ్బీర్ అలీ కాంగ్రెస్ అంటే రైతులు, రైతులు అంటే కాంగ్రెస్ అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. పీఏసీఎస్‌లు రాజకీయ పదవులుగా కాకుండా రైతు సేవా వేదికలుగా ఉండాలని సూచించారు. నూతన ఛైర్మన్లు గూడెం శ్రీనివాస్ రెడ్డి, భీంరెడ్డి, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, సమన్వయంతో సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు.
Shabbir Ali Kamareddy | మారేది భవనమే.. జ్ఞాపకాలు కాదు
మారేది భవనమే.. పాఠశాలలతో తనకు ఉన్న జ్ఞాపకాలు కాదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ భావోద్వేగంగా అన్నారు. సోమవారం ఆయన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాత భవనాన్ని కూల్చి ఆధునిక వసతులతో నూతనంగా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలకు వచ్చిన షబ్బీర్ అలీ తాను చదువుకున్న తరగతి గదిలో కొద్దిసేపు కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ పాఠశాల తనకు కేవలం విద్యాలయం కాదని, తన జీవితానికి పునాది వేసిన ప్రదేశమని, ఇక్కడి నుంచే తన ప్రయాణం మొదలైందని, అందుకే ఈ బడికి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు.
Shabbir Ali Kamareddy | అత్యాధునిక ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్,
అత్యాధునిక ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సౌకర్యాలతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అవసరమైన చోట తన సొంతంగా కూడా సహాయం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షబ్బీర్ అలీ తనతో కలిసి చదువుకున్న మిత్రులను పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఏళ్ల తర్వాత ఒకే చోట కలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ ఉమారాణి, గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.