అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Paddy Farmers | ప్రభుత్వం నిర్ధారించిన 9 వరి రకాలను సాగు చేసిన రైతులు ఏఈవోల దగ్గర రిజస్ట్రీ చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) సూచించారు. దీనిపై రైతువేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
సచివాలయంలో తన శాఖ పరిధిలోని వివిధ శాఖలు, సంస్థల ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విబ్ జి రామ్ జి కింద ఎకో పాండ్లు, వెదురు సాగు చేపట్టేలా పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఇప్పటివరకు రైతులకు సబ్సిడీపై ఎన్ని వ్యవసాయ యంత్రాలు అందించారనే వివరాలను తెలుసుకున్నారు. యంత్రాల పంపిణీలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు.
Paddy Farmers | గోదాములు నిర్మించాలి
మార్క్‌ఫెడ్‌కు మంజూరైన 65 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలను వరి అధికంగా పండించే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని మంత్రి సూచించారు. ఉద్యోగుల హాజరుపై రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అన్ని శాఖల్లో అమలు చేయాలన్నారు. విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. నర్సరీల్లో మిగిలిపోయిన మొక్కలను వెంటనే విక్రయించి, వచ్చే నెలకు కొత్త మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలకు అవసరమైన కూరగాయలను ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచే కొనుగోలు చేసేలా, అలాగే వంట నూనెగా విజయ ఆయిల్‌ను వినియోగించే అంశంపై హరేకృష్ణా చారిటీ ట్రస్ట్ ప్రతినిధులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.
Paddy Farmers | నకిలీ డీఏపీపై కఠిన చర్యలు
నకిలీ డీఏపీ (DAP) తయారీకి సంబంధించి 8 మందిపై కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని ఆదేశించారు. నకిలీ డీఏపీ ఎంతమేరకు, ఎవరెవరికి విక్రయించారో పూర్తి వివరాలు సేకరించి, నష్టపోయిన రైతులకు సంబంధిత వ్యక్తుల నుంచే పరిహారం ఇప్పించాలన్నారు.
దీనిని కూడా చదవండి : Urea Shortage Farmers | యూరియా కోసం కాళ్లు మొక్కిన రైతు