Shadow Sarpanch | సర్పంచ్​ భర్తల పెత్తనం.. ఫిర్యాదు చేస్తున్న గ్రామస్తులు

పాలన మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం రిజర్వేషన్​ అమలు చేస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి : Shadow Sarpanch | పాలన మహిళలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం రిజర్వేషన్​ అమలు చేస్తోంది. స్థానిక సంస్థల్లో అతివలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. దీంతో మహిళలు గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే పాలనలో మాత్రం వారు నామమాత్రంగా మారిపోయారు. పేరుకు సర్పంచ్​ అయినా.. పెత్తనం అంతా వారి కుటుంబంలోని పురుషులే చూసుకుంటున్నారు. భర్త, కుమారులు షాడో సర్పంచ్​గా వ్యవహరిస్తున్నారు.

జిల్లాలోని పలు గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పాలనకు బదులు ‘షాడో సర్పంచ్’ల పెత్తనం చర్చనీయాంశంగా మారుతోంది. మహిళా సర్పంచ్‌లు అధికారికంగా బాధ్యతలు చేపట్టినా.. వారి భర్తలు పంచాయతీ పాలనలో అనధికారికంగా జోక్యం చేసుకుంటూ అన్ని తామై నడిపిస్తున్నారనే ఆరోపణలు తీవ్రరూపం దాల్చడం గమనార్హం. పంచాయతీల్లో అధికారిక నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిపై ఆదేశాలు జారీ చేయడం, అభివృద్ధి పనుల విషయంలో జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు నెలకొన్నాయి. పదవి లేకపోయినా.. సర్పంచ్‌ భర్తల అనధికార పెత్తనం, నిర్ణయాల్లో జోక్యం గ్రామాల్లో కొత్త వివాదాలకు కారణమవుతోందన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పంచాయతీ నిర్ణయాలు తీసుకోవడం, గ్రామసభల్లో ప్రధాన పాత్ర పోషించడం వంటి పనులతో ఈ ‘షాడో సర్పంచ్‌ల’ పెత్తనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Shadow Sarpanch | అధికారాల దుర్వినియోగం

గ్రామ పంచాయతీల్లో నిబంధనలు, రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి అనధికార వ్యక్తులు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న వైనం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. పంచాయతీ చెక్కులపై సంతకాల నుంచి నిధుల వినియోగం వరకు సర్పంచ్‌ల భర్తలే అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. పనుల పేరిట నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ కార్యదర్శులు, పంచాయతీ సిబ్బందిపై హెచ్చరికలు జారీ చేస్తూ, తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన గ్రామసభల్లో సర్పంచ్ స్థానంలో భర్తలే అన్నీ తానై నడిపిస్తూ, ప్రజల ప్రశ్నలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మహిళా సర్పంచుల భర్తల పెత్తనం గురించి అధికారులకు తెలిసినా.. పట్టించుకోవడం లేదు.

Shadow Sarpanch | ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం

పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మాత్రమే అధికార విధులు నిర్వహించాలి. వారి భర్తలు, కుటుంబ సభ్యులు పంచాయతీ పాలనలో జోక్యం చేసుకోవడం చట్టరీత్యా నేరం. గ్రామ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, సర్పంచ్ భర్తల పెత్తనాన్ని అడ్డుకోవడంలో చొరవ చూపాలి. నిధుల ఉపసంహరణ, అధికార నిర్ణయాల్లో మహిళా సర్పంచ్‌ల ప్రత్యక్ష భాగస్వామ్యం, సంతకాలు కచ్చితంగా ఉండాలి. సర్పంచ్ భర్తలపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొన్ని ఘటనలు

* నిజామాబాద్ (Nizamabad) రూరల్ మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్​కు బదులుగా ఆమె భర్త పెత్తనం చెలాయిస్తున్నారని మాజీ సర్పంచ్​తో పాటు కొందరు గ్రామస్థులు ఇటీవల కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామంలో మహిళా భవనానికి భూమి పూజ చేసిన స్థలంలో కాకుండా, మరో స్థలంలో నిర్మాణ పనులు చేయాలని చూస్తున్నారని, దీనిపై నిలదీస్తే అక్రమంగా కేసులు నమోదు చేయించారని వాపోయారు.

* గత గ్రామపంచాయతీ ఎన్ని కల్లో ఓటు వేయలేదన్న కక్షతో సర్పంచ్​ భర్త తన ఇంటి నిర్మాణానికి సంబంధించి నోటీసు ఇచ్చారంటూ మద్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అధికారులకు ఫిర్యాదు చేసింది.
* డిచ్​పల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ భర్త పంచాయతీ పాలన, ఆర్థిక లావాదేవీల్లో పెత్తనం చెలాయిస్తూ, సర్పంచ్ అధికారులను దుర్వినియోగం చేస్తున్నారని వార్డు సభ్యులు డీఎల్పీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు తగ్గిన వరద.. వర్షాలు లేకపోవడమే కారణం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *