Revanth Reddy Mulugu Tour | తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు: రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Mulugu Tour | ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. రక్తసంబంధం లేకపోయినా మంత్రి సీతక్కను తాను సొంత సోదరిగా చూసుకుంటున్నానని చెప్పారు. కానీ, ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో సొంత చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపించారని విమర్శించారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రంలోని రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. కుమారుడు తప్పు చేస్తుంటే మందలించి బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని, సొంత బిడ్డను ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంటే ఆ తండ్రి మౌనంగా ఉన్నాడని ఆరోపించారు. కుమారుడు చేసిన నేరంలో తండ్రికి కూడా సగం భాగం ఉంటుందని, అలాంటి తండ్రీకొడుకులు రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకొకరిపై విమర్శలు చేస్తూ.. అఘోర పూజలు చేస్తున్న వ్యక్తి ప్రజలు ఇబ్బందులు పడాలని పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ దేవుడు మన వైపే ఉండి వర్షాలు కురిపించాడని తెలిపారు. ఇవాళ ములుగు జిల్లాలో చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను సీఎం అందజేశారు.

Revanth Reddy Mulugu Tour | మా ప్రభుత్వానికే దక్కుతుంది..

వనదేవతలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రామప్ప దేవాలయంతో సమానంగా సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా తాను ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రజల ఆశీర్వాదంతోనే తాము అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి నిధులు మంజూరు చేస్తామని, జంపన్న వాగును వంద శాతం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ములుగు ప్రాంత అభివృద్ధికి ఏయే పనులు కావాలో చెబితే వెంటనే నిధులు మంజూరు చేస్తామన్నారు. కేవలం చదువు మాత్రమే ఉద్యోగాన్ని ఇవ్వదని, విద్యార్థులు ఇంటర్ తర్వాత వివిధ రంగాల్లో నైపుణ్యాలు (స్కిల్స్) కూడా నేర్చుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి:  Amit Shah Sonia Gandhi | దేశ ప్రజలకు సోనియా గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి: అమిత్‌షా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *