PACS Committees | సొసైటీల పాలకవర్గాల నియామకంలో కొత్తవారికే అవకాశం!

తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది.

Srinivas Kolluri

అక్షరటుడే, ఎల్లారెడ్డి : PACS Committees | తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. ఎన్నికల నిర్వహణకు బదులుగా పూర్తిగా నామినేటెడ్ పద్ధతిలో పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేగాకుండా పాలకవర్గాల్లో పూర్తిగా కొత్తవారికి మాత్రమే అవకాశం ఇవ్వనుంది. గత పాలకవర్గంలో పనిచేసిన డైరెక్టర్లు, ఛైర్మన్లకు మళ్లీ అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది.

ప్రాథమిక సహకార సంఘాల కార్యవర్గాలను త్వరలో నియమించడానికి ప్రభుత్వం సిద్దం అవుతోంది. దీంతో పదవులు ఆశిస్తున్న కాంగ్రెస్​ నాయకులు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, డైరెక్టర్ పదవులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల, వ్యక్తిగత సహాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఎన్నికలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. డైరెక్టర్ పదవుల నుంచి ఛైర్మన్ స్థానం వరకు ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతుంది. భారీగా డబ్బు ఖర్చు, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలను రద్దు చేసింది. ఏఎంసీల తరహాలో పాలకమండళ్లు నియమించనుంది.

PACS Committees | ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని 144 సహకార సంఘాల్లో 1,872 డైరెక్టర్ పదవుల భర్తీ కానున్నాయి. ఎన్నికలు లేకుండా నేరుగా పదవులు రావడంతో అధికార పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. పదవుల కోసం ఆశావాహులు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హైదరాబాద్ వరకు వెళ్లి పైరవీలు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న క్యాడర్ కు ఈ కీలక పదవుల ద్వారా గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ పదవులన్నీ ఎమ్మెల్యేలు, వారి ముఖ్య అనుచరులు.. వ్యక్తిగత సహాయకుల సిఫారసు మేరకే భర్తీ అవుతాయని సమాచారం. కామారెడ్డి జిల్లాలో మొత్తం 55 సహకార సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే 10 విండోలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. వాటిలో రెండు విండోలకు పాలకవర్గాల నియామక ఉత్తర్వులు కూడా వచ్చాయి.

PACS Committees | 13 మందితో పాలకవర్గం..

సహకార చట్టం ప్రకారం ప్రతి పీఏసీఎస్​కు 13 మందితో కూడిన పాలకవర్గం ఉంటుంది. ఇందులో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. నామినేటెడ్ పద్ధతిలో 2 లేదా 3 స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించి తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన స్థానాలను జనరల్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు.

PACS Committees | వారికే అవకాశం

నామినేటెడ్ విధానంలో ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలు పెట్టింది. సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎలాంటి బకాయిలు లేని రైతులకు ప్రాధాన్యం ఇవ్వనుంది. గతంలో పనిచేసిన డైరెక్టర్లు, ఛైర్మన్లు ఈసారి అనర్హులు అని పేర్కొంది. సభ్యత్వం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు ఇవ్వద్దని ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలు పూర్తిగా నామినేటెడ్ విధానంలోనే అమలు అవుతున్నాయి. ఇదే ఫార్ములాను పీఏసీఎస్ లకు కూడా వర్తింపజేయనున్నారు.

ఇది కూడా చదవండి..: Polytechnic Education | పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఉద్యమిస్తాం..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *