అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Madhavanagar ROB | నగర శివారులోని మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనులు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2023లో ప్రారంభమైన వంతెన పనులు రెండేళ్లలో పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ సగం కూడా కాలేదు.
Madhavanagar ROB | 2023లో ప్రారంభం..
నిజామాబాద్–హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు మాధవనగర్ రైల్వే గేట్ వద్ద 2023లో ఆర్వోబీ పనులు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభించిన కొత్తలో వేగంగా జరిగిన పనులు ప్రస్తుతం పూర్తిగా మందగించాయి. నిర్మాణంలో భాగంగా రైల్వేగేట్‌కు ఇరువైపులా భారీ పిల్లర్లు,వాటి అనుసంధాన ప్రక్రియ జరుగుతోంది. పిల్లర్ల పైన దిమ్మెలు అమర్చినప్పటికీ ఇంకా చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
Madhavanagar ROB | రూ.93.12కోట్లతో ..
ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.93.12కోట్లుగా నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం (Central Government) తమ వాటగా రూ. 30.05కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ63.07కోట్లు ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆర్వోబీ నిర్మాణాన్ని సైతం రెండేళ్లలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు షరతులు విధించినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా పనులు నత్తకు నడక నేర్పేలా సాగుతున్నాయి. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు వెళ్లేందుకు మాధవనగర్ రహదారి ప్రధానమైంది. నిత్యం వేలసంఖ్యలో వాహనాలు ఈ దారిలో రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే రైల్వేగేట్ కారణంగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ఎన్నోసార్లు హైదరాబాద్‌కు అత్యవసర స్థితిలో వెళ్లాల్సిన అంబులెన్స్‌లు ఈ రైల్వేగేట్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి కట్టాలని నిర్ణయించారు. అయితే పనులు సాగకపోవడం, రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Madhavanagar ROB | రాష్ట్ర ప్రభుత్వం కారణంగానే..
ఈ ఆర్వోబీపై అనేకసార్లు ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఇవ్వాల్సిన వాట రూ.30కోట్లకు పైగా ఎప్పుడో ఇచ్చేశామని.. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆర్వోబీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ హయంలో ప్రారంభమైన ఈ నిర్మాణం.. కాంగ్రెస్ సర్కారు హయాంలోనూ నిర్లక్ష్యానికి గురువుతోందని ఆయన విమర్శించారు.
Madhavanagar ROB | వర్షాకాలంలో ప్రయాణం..నరకం..
రైల్వేగేట్ వద్ద ఇరువైపులా అప్రోచ్ రోడ్లపై కాంట్రాక్టర్ పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నాడని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండువైపులా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడడంతో ఆరకిలోమీటర్ కూడా ఉండని ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే భయపడాల్సి వస్తోందని వారంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ్లలో ఈ మార్గంలో రావాలంటేనే జంకుతున్నారు. గుంతల మయమైన ఆ రోడ్డు నుండి కిందామీద పడి రైల్వే గేటు వద్దకు వచ్చేసరికి లెక్కలేనన్నిసార్లు గేటు పడుతుందని, అక్కడ తమ సమయం అంతా హరించుకుపోతుందని ప్రజలు వాపోతున్నారు. వెంటనే అప్రోచ్ రోడ్లను బాగు చేయించి.. ఆర్వోబీని పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
Madhavanagar ROB | ఇటీవల నిధుల విడుదల..
ప్రభుత్వ సలహదారు సుదర్శన్ రెడ్డి ఇటీవల కలెక్టరేట్లో ఆర్వోబీపై సమీక్ష నిర్వహించారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తున్నాడనే సమాచారం తెలుసుకున్న ఆయన యుద్ధప్రాతిపదికన రూ.3.15కోట్ల నిధులు విడుదల చేయించారు. ఆర్వోబీ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, బ్లాక్ లిస్ట్‌లో పెడతామని ఆయన కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తికావాల్సిన ఆర్వోబీ నాలుగేళ్లయినా పూర్తికాకపోవడంతో నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్
కాంట్రాక్టు ku బుద్ధిలేదు
జబ్బలు charuchukune నాయకులకు ఏం లేదు
Inkennaaalllu ra మాkee tippalu