అక్షరటుడే, ఇందూరు: Nizamabad Irrigation Issues | ఇందూరును 18 ఏళ్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మార్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Nizamabad Irrigation Issues | సాగునీటి రంగంపై తీవ్ర నిర్లక్ష్యం..
తెలంగాణలోనే పెద్దదైన శ్రీరాం సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. అంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ప్యాకేజీ–21లో భాగంగా బినోల నుంచి సారంగాపూర్ వరకు రూ.900 కోట్లతో అండర్ గ్రౌండ్ పంపింగ్ వ్యవస్థను నిర్మించారని.. సారంగాపూర్ వరకు పంపులను ట్రయల్ రన్ చేసినప్పటికీ నిరుపయోగంగా మారాయన్నారు. ఎస్సారెస్పీలో నీరు అధికంగా ఉన్నప్పుడు సరైన నిర్వహణ లేక పంపులు మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.
Nizamabad Irrigation Issues | సారంగాపూర్ నుంచి కొండెం చెరువు వరకు..
సారంగాపూర్ నుంచి కొండెం చెరువు వరకు 9 కి.మీ మేర సుమారు రూ.1,200 కోట్లతో పనులు చేపట్టారని.. సారంగాపూర్ నుండి గుత్ప, అలీసాగర్ పరిధిలోని 47 వేల ఎకరాలకు నీరందించాలంటే 1,0000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని దినేష్ తెలిపారు. కానీ కెనాల్ సామర్థ్యం సరిపోక ఆ నీరు వంతెనను తాకుతోందన్నారు. 18 ఏళ్లుగా ఈ కాల్వల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. సారంగాపూర్ నుండి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్, డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, సిరికొండ ప్రాంతాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు పైపుల ద్వారా గాని కెనాల్ ద్వారా గాని అందించాలంటే సుమారు 10 టీఎంసీల నీరు అవసరం ఉంటుందన్నారు. అయితే కెనాల్ ద్వారా 47 వేల ఎకరాలకు నీరు అందించడానికి కూడా కెనాల్ సామర్థ్యం సరిపోవడం లేదని ఆయన వివరించారు. కాబట్టి, కెనాల్‌ను వెడల్పు చేస్తేనే లక్ష ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Nizamabad Irrigation Issues | బీఆర్ఎస్ హయాంలో దోచుకున్నారు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం దోచుకునేందుకే రూ.18,000 కోట్లతో కొండెం చెరువు కింది నుండి పైపులైన్ పనులు చేపట్టిందని దినేష్ ఆరోపించారు. బైరాపూర్, మెంట్రాజ్‌పల్లి వద్ద భారీ పంప్ హౌస్‌లను నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని తెలిపారు. మంచిప్ప, బైరాపూర్, అమ్రాబాద్, కల్పోల్ ఇతర తండాలో ప్రాజెక్టుల వల్ల ఒక్క ఎకరం భూమి కూడా మునగకుండా, బైరాపూర్ పంప్ హౌజ్ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Nizamabad Irrigation Issues | కమీషన్ల కోసం కమ్ములాటలు..
పైపులైన్ పనులు పూర్తయిన చోట కూడా, కేవలం కమీషన్ల కోసం కాల్వల నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దినేష్ పేర్కొన్నారు. గతంలో బాజిరెడ్డి గోవర్ధన్, కవితల మధ్య కమీషన్ల పోరులో ప్రాజెక్ట్ నలిగిపోయి నష్టపోవడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అదే రీతిలో ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్ రెడ్డిల మధ్య కమీషన్ల కుమ్ములాటల వల్ల ప్రాజెక్టులు మరోసారి బలి అవుతుందని వాపోయారు. కార్యక్రమంలో గద్దె భూమన్న, నక్క రాజేశ్వర్, ఓం సింగ్, అనంత్ రెడ్డి, కర్క గంగారెడ్డి, చింత శ్రీనివాస్ రెడ్డి, నరేష్, శంకర్ రెడ్డి, శశాంక్, జగన్ రెడ్డి, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Induru Ranabheri | బీజేపీ ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమం అట్టర్‌ప్లాప్ షో..: బొబ్బిలి రామకృష్ణ