Konda Susmitha Parakala | సీఎం మీరా.. లేక ఆయనా? – రేవంత్‌రెడ్డికి కొండా సుస్మిత ప్రశ్న

తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Susmitha Parakala | తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో జరిగిన బహిరంగ సభలో ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. దీనిపై కొండా సుస్మితా స్పందిస్తూ.. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.

పరకాలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎవరికైనా తెలుసా అని నిలదీశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి విషయంలో అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పిన సీఎం, పరకాలలో మాత్రం తానే ఎలా నిర్ణయిస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప నేతలు కాదని, సీఎం కుర్చీ కాపాడుకోవాలంటే నిబద్ధత ఉండాలని హెచ్చరించారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఒకసారి ఓడిపోలేదా అని గుర్తు చేస్తూ, బీసీలంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత చులకనని మండిపడ్డారు.

Konda Susmitha Parakala | ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, రేవంత్ రెడ్డికి  ( Revanth Reddy )పీసీసీ చీఫ్ పదవి రావడానికి కొండా దంపతులు ఎంతగానో కృషి చేశారని సుస్మితా గుర్తుచేశారు. కాంగ్రెస్ గెలిచినా గెలవకపోయినా కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కొండా మురళి మామూలు లీడర్ కాదని, ఆయనో కింగ్ మేకర్ అని స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ కాగానే రేవంత్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని, ఈ మూడేళ్లలో వేం నరేందర్ రెడ్డి ఇచ్చిన సలహాల్లో రేవంత్ రెడ్డి ఏం పాటించారో చెప్పాలని నిలదీశారు.

Konda Susmitha Parakala | మంత్రి పొంగులేటిపై పరోక్ష వ్యాఖ్యలు..

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి కూడా సుస్మితా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఓ ‘పొంగు’ ఉందని, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదని వ్యాఖ్యానించారు. అసలు ముఖ్యమంత్రి మీరా లేక అతనా అని ప్రశ్నించారు. మొన్న హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే సీఎం ఫోటోతో పాటు పొంగులేటి ఫోటో వేసుకున్నారు కానీ, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటో ఎందుకు వేయలేదని నిలదీశారు.

పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు కొండా సుస్మితా ఆసక్తి చూపుతున్నారు. గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖ ప్రస్తుతం వరంగల్ తూర్పు నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే సీఎం రేవూరి ప్రకాశ్ రెడ్డి పేరును ప్రస్తావించడం కొండా వర్గంలో అసంతృప్తికి కారణమైంది. మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో సుస్మితా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఇది కూడా చదవండి: Head Constable | హెడ్​ కానిస్టేబుల్​ తిరుపతి కుటుంబాన్ని ఆదుకుంటాం: సీపీ సాయిచైతన్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *