అక్షరటుడే, వెబ్డెస్క్: Calcutta High Court | పశ్చిమ బెంగాల్‌లోని మసీదుల నుంచి పోలీసులు Police లౌడ్‌స్పీకర్లను తొలగించారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ ఆరోపణలకు తగిన ఆధారాలు పిటిషన్‌లో సమర్పించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ అతరూప్ బెనర్జీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. హుగ్లీతో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రార్థనా స్థలాల నిర్వహణ కమిటీల ప్రతినిధులు, ఇమామ్‌ల నుంచి సమాచారం అందిందనే ఆధారంతో పిటిషన్ దాఖలైనప్పటికీ.. ఆ ఆరోపణలను నిర్ధారించే పత్రాలు ఏవీ జత చేయలేదని కోర్టు పేర్కొంది.
Calcutta High Court | నిర్దిష్ట ఆధారాలు లేవంటూ..
పశ్చిమ బెంగాల్‌లో సుమారు 4,000 మసీదుల నుంచి పోలీసుల ఒత్తిడితో లౌడ్‌స్పీకర్లను తొలగించారన్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట వివరాలు లేవని ధర్మాసనం తెలిపింది.
పోలీసు అధికారులు చేసినట్లు పేర్కొన్న ఏదైనా నిర్దిష్ట చర్యకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానం లేదా ఆరోపణలు మాత్రమే వాస్తవ రుజువుకు ప్రత్యామ్నాయం కాలేవని స్పష్టం చేసింది.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
పోలీసులు ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించి లౌడ్‌స్పీకర్లు తొలగించారని లేదా పరికరాలను స్వాధీనం చేసుకున్నారని కూడా పిటిషన్‌లో ఆరోపించలేదని కోర్టు గమనించింది. పిటిషనర్ ఆధారంగా చూపిన వార్తా కథనం కూడా పోలీసులు ఏకపక్షంగా లేదా విచక్షణారహితంగా వ్యవహరించారనే విషయాన్ని నిర్ధారించలేదని పేర్కొంది.
Calcutta High Court | పిటిషన్ ఏమిటంటే..
న్యాయవాది డానిష్ ఫరూఖీ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. హుగ్లీతో పాటు ఇతర జిల్లాల్లో మసీదులు, ఆలయాలు సహా వివిధ ప్రార్థనా స్థలాల్లో ఏర్పాటు చేసిన లౌడ్‌స్పీకర్లను తొలగించాలంటూ పోలీసులు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు.
లౌడ్‌స్పీకర్ల నుంచి వెలువడే శబ్ద తీవ్రతను కొలిచి, నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో నిర్ధారించకుండానే పోలీసు అధికారులు ఆయా ప్రార్థనా స్థలాల నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చారని పిటిషనర్ వాదించారు.
అజాన్ ఇస్లాం మత విశ్వాసంలో అంతర్భాగమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు దీనికి వర్తిస్తాయని కూడా వాదించారు.
Calcutta High Court | మౌఖిక ఆదేశాలు జారీ చేశారంటూ..
ఆగస్టు 3న హుగ్లీ జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సమావేశాలు నిర్వహించి, మసీదులు, ఆలయాల ప్రతినిధులను లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు మౌఖికంగా ఆదేశించారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కల్యాణ్ బంద్యోపాధ్యాయ గత విచారణలో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అయితే పిటిషన్ నిర్వహణార్హతను పశ్చిమ బెంగాల్ అడ్వొకేట్ జనరల్ సూరజిత్ నాథ్ మిత్రా వ్యతిరేకించారు. ఆరోపణలకు సంబంధించి పిటిషనర్ ఎలాంటి నిర్దిష్ట వివరాలు వెల్లడించలేదని ఆయన వాదించారు. అదనపు అడ్వొకేట్ జనరల్ బిల్‌వాదల్ భట్టాచార్య కూడా రాష్ట్రం తరఫున వాదనలు వినిపించారు.
ఆరోపణలకు మద్దతుగా తగిన ఆధారాలు లేవని తేల్చిన హైకోర్టు.. పిటిషనర్ కోరిన ఉపశమనాన్ని మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేసింది.